ఉద్ధవ్ థాక్రేకు ఎదురుదెబ్బ: రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
ముంబై: మహారాష్ట్ర సంక్షోభానికి తెరపడే సమయం వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన బలం నిరూపించుకోవాల్సి ఉంది. లేదంటే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి కొంత నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది.
Recommended Video

అయితే, గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ థాక్రే బలం నిరూపించుకోవాల్సి ఉంది. బలం నిరూపించుకునే ముందే ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసే అవకాశం కూడా లేకపోలేదు. గురువారం ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష జరగనుంది.

బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ ఆదేశించడంపై సర్వోన్నత న్యాయస్థానాన్ని శివసేన ఆశ్రయించగా.. వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబాటుతో సంక్షోభంలో పడిన ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవాలని రాష్ట్ర గవర్నర్ ఆదేశించారు. అయితే, దీన్ని సవాల్ చేస్తూ థాక్రే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది. దీంతో ప్రభుత్వ అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం నేడు విచారించి ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
మహా ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మంగళవారం రాత్రి ప్రతిపక్ష నేత గవర్నర్ ను కలిశారని, ఆ భేటీ తర్వాత కొద్ది గంటలకే బలపరీక్ష గురించి ఆదేశాలు వచ్చాయని థాక్రే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఇద్దరు ఎన్సీపీ సభ్యులు కరోనాతో బాధపడుతున్నారని, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నారని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నిర్వహించడం సరికాదని తెలిపింది.
మరోవైపు, ఏక్ నాథ్ షిండే తరపున ఎస్కే కౌల్ తమ వాదనలు వినిపించారు. బలనిరూపణ నిర్వహించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వానికి తగిన బలం లేదని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం బలపరీక్ష నిర్వహించాలని తీర్పు వెలువరించింది.












Click it and Unblock the Notifications