RSS: మోహన్ భగవత్‌తో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ భేటీ: కొత్త ఈక్వేషన్స్?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెరమీదికి వచ్చే అవకాశాలు కనిపిస్తోన్నాయి. అధికారాన్ని కోల్పోయిన తరువాత భారతీయ జనతా పార్టీ రాజకీయంగా కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మహారాష్ట్ర బీజేపీలో బలమైన నేతగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ పార్టీని బలోపేతం చేయడానికి కొత్త చేరికలను ప్రోత్సహిస్తోన్నారు. కొత్తగా రాజకీయాల్లో చేరదలచుకున్న వారికి బీజేపీని బెస్ట్ ఆప్షన్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోన్నారు.

మోహన్ భగవత్‌తో ఎస్ఏ బొబ్డే భేటీ..
ఈ విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహకారం ఎలాగూ ఉంటుంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే.. ఆర్ఎస్ఎస్ అధినేత, సర్‌సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్‌తో భేటీ కావడం.. ఇలాంటి రాజకీయ పరిణామాలు, సరికొత్త ఈక్వేషన్లకు తెర తీసినట్టు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్. ఎస్ఏ బొబ్డే స్వస్థలం కూడా నాగ్‌పూరే. దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్‌గా పదవీ విరమణ చేసిన తరువాత.. ఎస్ఏ బొబ్డే నాగ్‌పూర్, ఢిల్లీల్లో నివసిస్తోన్నారు.

ఏ అంశాలపై చర్చించారు?
అక్కడే మోహన్ భగవత్‌తో సమావేశం అయ్యారు. సుమారు గంట పాటు వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. మోహన్ భగవత్-ఎస్ఏ బొబ్డె మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయనేది తెలియరావట్లేదు. వారిద్దరి సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదనే అభిప్రాయాలు సైతం ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి వ్యక్తమౌతోన్నాయి. ఎస్ఏ బొబ్డే.. మోహన్ భగవత్‌ను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని చెబుతున్నాయి.

కేబీ హెడ్గెవార్ నివాసాన్నీ..
నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో గల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎస్ఏ బొబ్డె.. మోహన్ భగవత్‌ను కలిశారని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం తెలిసినట్లు స్పష్టం చేసింది. మోహన్ భగవత్‌తో ఎస్ఏ బొబ్డే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో సమావేశం కావడం ఇదే తొలిసారిగా పేర్కొంది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గెవార్ నివాసాన్ని సైతం ఎస్ఏ బొబ్డె సందర్శించినట్లు తెలిపింది.

రిటైర్మెంట్ తరువాత తొలిసారిగా..
ఈ ఏడాదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్ఏ బొబ్డె పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఏపీకి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. పదవీ విరమణ తరువాత ఎస్ఏ బొబ్డె ఎక్కువ సమయాన్ని ఢిల్లీ, నాగ్‌పూర్‌లల్లో గడుపుతున్నారు. నాగ్‌పూర్‌తో ఆయన విడదీయరాని అనుబంధం ఉంది. కొన్ని సంవత్సరాల పాటు ఆయన అక్కడే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

అప్పట్లో రంజన్ గొగొయ్‌కు రాజ్యసభ..
రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేసిన తరువాత ఆయన స్థానంలో బొబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. కాగా- రంజన్ గొగొయ్ పదవీ విరమణ అనంతరం ఆయనను భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. తాజాగా- బీజేపీ మాతృసంస్థగా చెప్పుకొనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్‌ను బొబ్డే సమావేశం కావడంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.
Recommended Video

వివాదరహితుడిగా
రంజన్ గొగొయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల బీజేపీ పలు విమర్శలను ఎదుర్కొంది. చారిత్రాత్మక రామజన్మభూమిపై అనుకూల తీర్పు ఇవ్వడం వల్లే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎస్ఏ బొబ్డెపై ఎలాంటి వివాదాలు లేవని, మోహన్ భగవత్ ద్వారా బీజేపీ పెద్దల దృష్టిని ఆకర్షించడానికి ఆయన తనవంతు ప్రయత్నాలేవైనా చేస్తోన్నారా? అనేది తెలియరావాల్సి ఉందని అంటోన్నారు.












Click it and Unblock the Notifications