ఎక్కడా మద్యం దొరకట్లేదని... ఆల్కాహాల్ బదులు శానిటైజర్... ఏడుగురు మృతి...
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బదులు హ్యాండ్ శానిటైజర్ తాగిన ఏడుగురు మృతి చెందారు. లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో ఆ ఏడుగురు శానిటైజర్ తాగారు. యావత్మాల్ జిల్లాలోని వాణి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా రోజు వారీ కూలీలే కావడం గమనార్హం.
స్థానిక పోలీస్ అధికారి అంజయ్ పుజాల్వర్ మాట్లాడుతూ... లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసి ఉండటంతో... మద్యానికి బదులు వారు హ్యాండ్ శానిటైజర్ తాగారని తెలిపారు. మత్తు కోసమే వారు శానిటైజర్ తాగినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే వారు తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనపై యావత్మాల్ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది.

కోవిడ్ నియంత్రణ కోసం ఉపయోగిస్తున్న హ్యాండ్ శానిటైజర్‌లో 70శాతం ఆల్కాహాల్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే దాన్ని ఎక్స్‌టర్నల్(బయటి వినియోగం)గానే వినియోగించాలి. అంతే తప్ప సాధారణ ఆల్కాహాల్ లాగా దీన్ని సేవిస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
ప్రస్తుతం మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా వాటిని రద్దు చేశారు. మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియులు ఇలా హ్యాండ్ శానిటైజర్లను సేవించి మృత్యువాత పడుతున్నారు.గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలోనూ అక్కడక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆల్కాహాల్ బదులు హ్యాండ్ శానిటైజర్ సేవించిన 10 మంది మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న సంగతి తెలిసిందే. మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు అల్లాడిపోతున్నారు. గడిచిన రెండు రోజుల్లో ఢిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక దాదాపు 45 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3.49లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 2676 మంది కరోనాతో మృతి చెందారు. ఏప్రిల్ 15 నుంచి దాదాపుగా ప్రతీరోజూ దేశంలో 2లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి.












Click it and Unblock the Notifications