మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు: బీజేపీ కూటమి హవా
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా చాటింది. సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో మొత్తం 11 సీట్లకు శుక్రవారం పోలింగ్ నిర్వహించగా.. పోటీ చేసిన తొమ్మిది స్థానాల్లో అన్నింటా విజయం సాధించింది. ఇందులో బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించగా.. సీఎం ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు చెరో రెండు స్థానాలు దక్కించుకున్నాయి.
ఇక, విపక్షాల మహావికాస్ అఘాడీలో శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సన్నిహితుడు మిలింద్ నార్వేకర్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రద్య్నా సతవ్ లు గెలుపొందారు. ఎన్సీపీ శరద్ పవార్ తమ అభ్యర్థిని బరిలో నిలపలేదు. పీడబ్ల్యూపీ అభ్యర్థి జయంత్ పాటిల్ కు మద్దతు ఇచ్చింది. అయితే, ఆయన ఓటమి పాలయ్యారు. శాసనమండలిలో 11 మంది ఎమ్మెల్సీ పదవీకాలం జులై 27తో పూర్తికానున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.

కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఫలితాలు కూటమిలో కొత్త జోష్ నింపినట్లయింది. పోటీ చేసిన తొమ్మిదింట తొమ్మిది స్థానాలు కైవసం చేసుకున్నామంటూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా విజయం సాధించాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినవారిలో.. బీజేపీ నుంచి మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజా ముండే, యోగేశ్ తిలేకర్, పరిణయ్, అమిత్ గోర్ఖే, సదాభావు ఖోట్ ఉన్నారు. శివసేన నుంచి మాజీ ఎంపీలు కృపాల్ తుమానే, భావనా గవాలీ, ఎన్సీపీ నుంచి శివాజీరావు గార్జే, రాజేష్ విటేకర్ ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. కాగా, ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ భయంతో ఆయా పార్టీలు రిసార్టు రాజకీయాలకు దిగడం గమనార్హం.












Click it and Unblock the Notifications