Maharashtra Polls: 160 స్థానాలకు కన్నేసిన బీజేపీ..షాతో చర్చలు విఫలం..?
Maharashtra Polls:మహారాష్ట్ర ఈ ఏఢాది అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ వెలువడనప్పటికీ అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇదే సమయంలో పొలిటికల్ హీట్ కూడా పెరుగుతోంది. తాజాగా బీజేపీ నేతృత్వంలో షిండే నాయకత్వం వహిస్తోన్న శివసేన పార్టీ, అజిత్ పవార్ నడిపిస్తోన్న ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాల విషయమై చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో ఉన్న పార్టీలు సీట్ల పంపకాల విషయమై చర్చలు జరుపుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ చర్చలకు నేతృత్వం వహిస్తున్నారు. అయితే బీజేపీ ఈసారి 140 నుంచి 150 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో శివసేన పార్టీ 80 స్థానాలు, అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ 55 సీట్లకు కంటెస్ట్ చేస్తారని తెలుస్తోంది.మరో మూడు సీట్లు చిన్న పార్టీలకు కేటాయిస్తారనే వార్త ప్రచారంలో ఉంది.

ఎవరికెన్ని సీట్లు
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మూడు పార్టీల అధినేతలతో చర్చలు జరిపారు. అందరికి గౌరవప్రదమైన సీట్లను కేటాయిస్తామని చెప్పినట్లు సమాచారం. మరోవైపు అందరు కలిసి ఏకతాటిపై నడవాలని, అనవసరపు రాద్దాంతాలకు పోకూడదని అమిత్ షా సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ 150 నుంచి 160 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని మరో వార్త ప్రచారంలో ఉండగా మిగతా రెండు పార్టీలు 128 నుంచి 138 స్థానాల్లో, మిగిలిన మరో మూడు స్థానాల్లో చిన్న పార్టీలు పోటీ చేస్తాయని అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్ అగాఢీ
ఇక మహారాష్ట్రలో పోటీ మహాయుతి మహా వికాస్ అగాఢీల మధ్య ఉంటుంది. ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీలు కలిసి మహావికాస్ అగాఢీ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్ అగాఢీ కూటమి 48 స్థానాలకు గాను 30 స్థానాల్లో విజయం సాధించగా మహాయుతి కూటమి 17 స్థానాలకు పరిమితమైంది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన పార్టీలు కలిసి పోటీచేసి విజయం సాధించాయి. అయితే నాయకత్వం విషయంలో రెండు పార్టీల మధ్య విబేధాలు రావడంతో ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022లో శివసేన పార్టీలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాహుటా ఎగురవేయడంతో పార్టీలో చీలిక వచ్చింది.దీంతో షిండే ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం బీజేపీతో జతకట్టిన షిండే వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అమిత్ షా వరుస సమావేశాలు
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 160 సీట్లలో పోటీ చేసి అజిత్ పవార్ ఎన్సీపీకి 60 సీట్లు, ఏక్‌నాథ్ షిండే పార్టీకి 70 సీట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో 160 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 105 సీట్లను గెలిచిందని ఓ సీనియర్ బీజేపీ నాయకుడు గుర్తు చేశారు.ఈ సారి 160 సీట్లలో పోటీచేసి 100కు పైగా స్థానాల్లో గెలవాలనేదే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఇక అమిత్ షాతో రెండు సార్లు సమావేశం జరిగింది. తొలి సమావేశం ముంబై విమానాశ్రయంలో జరుగగా ఈ మీటింగ్‌లో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు హాజరయ్యారు. పథకాలు, పార్టీలకు నిధుల సేకరణ,ఫైల్స్, పలు ప్రతిపాదనలు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ జరిగింది. ఇక మరో సమావేశంలో పార్టీ అధినేతలతో సీట్ల పంపకాలు, అంతర్గత వివాదాలపై చర్చించినట్లు తెలుస్తోంది. శివసేన పార్టీకి చెందిన మంత్రులు ఎన్సీపీపై మాటల దాడులకు దిగడంపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లా ఉండబోతున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications