ఎన్నికల వేళ రంగంలోకి ధోనీ - అనూహ్య నిర్ణయం..!!
జార్ఖండ్ ఎన్నికల వేళ కీలక నియామకం జరిగింది. మాజీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ధోనీ కీలక బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం నిర్వహించే ప్రచారం లో ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారుల అభ్యర్ధనకు ధోనీ అంగీకారం తెలిపారు. ఎన్నికల పై ఓటర్లలో అవగాహన పెంచటం తో పాటుగా భారీ పోలింగ్ దిశగా ధోనీ కృషి చేస్తారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
రంగంలోకి ధోనీ
జార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్ గా క్రికెటర్ ధోనీ నియమితులయ్యారు. ధోనీ స్వరాష్ట్రం జార్ఖండ్. క్రికెట్ లో అడుగు పెట్టిన తొలి రోజుల్లో జార్ఖండ్ డైనమైట్ గా ధోనీని పిలిచేవారు. ఇప్పుడు జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఓటర్లలో అవగాహన కోసం ధోనీ సేవలు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందు కోసం ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఇక, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది.

కూటముల సమరం
జార్ఖండ్ లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)- కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమైంది. అయితే ఇండియా కూటమి లక్ష్యంగా బీజేపీ తమ ప్రచార అస్త్రాలను ఖరారు చేసింది. అందులో భాగంగా బంగ్లాదేశీల చొరబాటు, అవినీతి అంశాలే ఎజెండాగా ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ప్రచారం ప్రారంభించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. ఇక,మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టునూ ఎన్డీఏ కూటమి ప్రస్తావిస్తోంది. మరోవైపు, సంక్షేమ పథకాలను ఇండియా కూటమి నమ్ముకుంది. సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా జేఎంఎం ఆరోపిస్తోంది.
రెండు విడతల్లో
జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఇక్కడ రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించింది. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనుండగా.. మిగిలిని 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఈ సారి జార్ఖండ్ లో గెలుపు రెండు కూటములు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది.












Click it and Unblock the Notifications