కేరళలో పెను విషాదం: 12 మంది దుర్మరణం- 400 మందికి పైగా
Kerala landslides: కేరళలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 12 మంది మరణించారు. 400 మందికి పైగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
వాయనాడ్ జిల్లాలో ఈ తెల్లవారు జామున ఈ ఉదంతం సంభవించింది. కేరళలో కొద్దిరోజులుగా ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేెకించి- కేరళ ఉత్తరప్రాంతంలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటోంది. చెరువులు, కుంటలు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.

భారీ వర్షాల తాకిడికి వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని మెప్పాడి, ముండక్కై టౌన్, చూరల్‌మాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగి జనావాసాల మీద పడ్డాయి. అదే సమయంలో బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది.
అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు తొలి దుర్ఘటన సంభవించింది. ముండక్కై టౌన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. తెల్లవారు జామున 4 గంటల సమయంలో చూరల్‌మాలాలో రెండో ప్రమాదం చోటు చేసుకుంది. చూరల్‌మాలాలో గల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలో ఉన్న వాళ్లు ప్రమాదానికి గురయ్యారు. చుట్టు పక్కల ఉన్న నివాసాలు దెబ్బతిన్నాయి.
కోజికోడ్ జిల్లా వనిమాళ్ గ్రామ పంచాయితీ పరిధిలోని విలంగాడ్ వద్దా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆయా ఘటనల్లో ఇప్పటివరకు 12 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. 400 మందికి పైగా చిక్కుకుపోయారు. 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అట్టమాలా గ్రామంలో ఆరు మృతదేహాలను వెలికి తీశారు.
ఉరుట్టిలో కొత్తగా నిర్మించిన వంతెన పాక్షికంగా కొట్టుకుపోయింది. అక్కడ బురద నీటితో కూడిన వరద ఉప్పెలా విరుచుకుపడటం కనిపించింది. పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. వీధుల్లో బురద ప్రవహించింది. కార్లు, జీపులు సైతం కొట్టుకుపోయాయంటే బురద ప్రవాహం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోసుకోవచ్చు.












Click it and Unblock the Notifications