ఎట్టకేలకు మాల్దీవుల్లో ఎమర్జెన్సీ ఎత్తివేత
మాలే: ఎట్టకేలకు మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితిని ఎత్తేశారు. గత 45 రోజులుగా దేశంలో కొనసాగుతున్న అత్యయిక స్థితిని తొలగిస్తున్నట్లు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ వెల్లడించారు. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భద్రతా బలగాల సూచనల మేరకు ఎమర్జెన్సీని తొలగించినట్లు యమీన్ కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.
తన రాజకీయ ప్రత్యర్థులను కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేసేందుకు యమీన్ నిరాకరించడంతో మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.
రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంపీలను తిరిగి పదవుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యమీన్ తీవ్రంగా వ్యతిరేకించారు.

తీర్పును అమలు చేసేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడికి, సుప్రీంకోర్టుకు మధ్య వివాదం నెలకొంది. దీంతో యమీన్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఎమర్జెన్సీ సమయంలో మాజీ అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్‌ను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్, మరో న్యాయమూర్తి అలీ హమీద్‌తో పాటు నలుగురు శాసనకర్తలను కూడా అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications