ఆగస్టు 27దాటితే మాల్యాకు ‘నేరస్తుడు’గా గుర్తింపు: ఆస్తులు జప్తే
ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయాల రుణాలు ఎగ్గొట్టి దేశం పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై చర్యలు తీసుకునేందుకు ఇటీవల ఈడీ అధికారులు ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అతడిని పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానంలో దరఖాస్తు సమర్పించింది.
తాజాగా దీనిపై విచారించిన ప్రత్యేక కోర్టు మాల్యాకు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 27లోగా మాల్యా కోర్టులో హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. ఒకవేళ మాల్యా రాకపోతే అతడిని 'పరారీలో ఉన్న నేరస్థుడి'గా ప్రకటిస్తామని, అంతేగాక మాల్యాకు చెందిన రూ. 12,500కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసుకుంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

విజయ్ మాల్యాను నేరస్థుడిగా ప్రకటించడంతో పాటు అతని రూ.12,500 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ముంబై కోర్టులో ఈడీ గతవారం దరఖాస్తు సమర్పించింది.
ఈ ఆస్తుల్లో స్థిరాస్తులతోపాటు షేర్లు కూడా ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ఇటీవలే అమల్లోకి వచ్చిన ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్‌ను ప్రయోగించింది. ఏప్రిల్‌లో ఈ కొత్త ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. పారిపోయిన వ్యక్తుల ఆస్తుల్ని ఇక్కడ జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది.












Click it and Unblock the Notifications