తల్లిదండ్రులు, సోదరిని హత్య.. కారణం అదే !
ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లా డెలియాలో భయానక ఘటన చోటుచేసుకుంది. కన్నవారు అనే కనికరం.. తోడబుట్టింది అనే మమకారం లేకుండా ఒక కిరాతక కొడుకు తన తల్లి, తండ్రి, సోదరిని గొడ్డలితో నరికి చంపిన దారుణం సర్వత్రా కలకలం రేపింది. నిందితుడిని అభయ్ యాదవ్ గా గుర్తించగా.. హత్య అనంతరం ఆయన పరారీలో ఉన్నట్టు గుర్తించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్టు చెబుతున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరామ్ యాదవ్ (తండ్రి) తన భూమిలో కొంత భాగాన్ని తన కుమార్తెకు బదిలీ చేశాడు. ఇది కొడుకు అభయ్‌కు నచ్చకపోవడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అభయ్ యాదవ్ వివాహం చేసుకుని తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటున్నాడు. అతని సోదరి వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత.. తల్లిదండ్రులతో కలిసి ఉంటూ వారిని చూసుకునేది.

అయితే భూమి విషయంలో తల్లిదండ్రులతో అభయ్‌కు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే వాగ్వాదం తీవ్రరూపం దాల్చి హత్యకు దారితీసిందని భావిస్తున్నారు. గ్రామస్థులు పొదల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే జిల్లా ఎస్పీ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు పరిస్థితులను పరిశీలించారు. ఈ సంఘటనపై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ ధృవీకరించారు. అభయ్ యాదవ్‌ను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గ్రామ పరిసరాల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోవైపు ఒకే కుటుంబంలో ఇలాంటి దారుణం జరగడం వల్ల గ్రామస్థులు షాక్‌లో ఉన్నారు. పోలీసులు గ్రామస్థుల నుంచి సమాచారాన్ని సేకరిస్తూ నిందితుడి కదలికలపై ఆధారాలు గడిస్తున్నారు. హత్యలో వాడిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభయ్ గతంలో కూడా తన తల్లిదండ్రులతో భూమి విషయంలో తగాదాలు పెట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. నిందితుడి ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications