అడ్డు తొలగించుకుంటే ఆస్తి తనదవుతుందని.. సొంత బావే.. మరదలిని..
అడ్డు తొలగించుకుంటే ఆస్తి తనదవుతుందన్న దురాశతో సొంత బావే.. మరదలిని హతమార్చిన ఉదంతమిది.
బెంగళూరు: అడ్డు తొలగించుకుంటే ఆస్తి తనదవుతుందన్న దురాశతో సొంత బావే.. మరదలిని హతమార్చిన ఉదంతమిది. అంతేకాక ఆమె మూర్చతో పడిపోయిందని, చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని కట్టుకథ కూడా అల్లాడు.
అయితే పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. వారు తమదైన శైలిలో విచారణ ప్రారంభించేసరికి తానే హతమార్చానని ఒప్పుకున్నాడు. పోలీసుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరుకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి కొన్నేళ్ల క్రితం చిత్తూరుకే చెందిన చొన్నెయ జగదీష్ కు ఇచ్చి వివాహం చేశారు. వివాహానంతరం జగదీష్ బెంగళూరులో ఉంటున్న అత్తమామల ఇంటికే ఇల్లరికం వచ్చేశాడు.

లక్ష్మమ్మ, ఆమె భర్త నాలుగు దశాబ్దాల క్రితమే బెంగళూరుకు వచ్చి రెక్కలు ముక్కలు చేసుకుని ఆస్తి కూడబెట్టుకున్నారు. నాయుడు లే అవుట్ లో సొంతిల్లు కట్టుకున్నారు. చిత్తూరులో ఒక ఎకరం పొలం కూడా కొనుక్కున్నారు. తమ స్థిరాస్థి, నగదును కుమార్తెలిద్దరి పేరిట సమంగా పంచారు.
కొద్ది రోజుల క్రితం జగదీష్ మరదలు పవిత్ర(18)కు కూడా వివాహమైంది. అప్పటికే ఆమె మరో యువకుడిని ప్రేమించగా.. కుటుంబ సభ్యులు, జగదీష్ కలిసి ఆమెకు బలవంతంగా మరొకరితో వివాహం జరిపించారు.
అయితే వివాహానంతరం కూడా పవిత్ర తరచూ భర్తతో గొడవ పడి తన పుట్టింటికి వచ్చేస్తుండేది. దీంతో పెళ్లి చేసుకున్న తరువాత భర్తను వదలి రావడం సరికాదంటూ ఆమె అక్క మొగుడైన జగదీష్ మందలించాడు.
ఈ నేపథ్యంలో ఇద్దరికీ గొడవ జరిగింది. అసలు ఆమెను ఈ లోకం నుంచే తప్పిస్తే ఆమె పేరిట ఉన్న ఆస్తి కూడా తన భార్యకే వస్తుంది కదా.. అన్న కపట ఆలోచన జగదీష్ మస్తిష్కంలో మెరుపులా మెరిసింది.
దీంతో గత శనివారం రాత్రి తన గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న పవిత్ర మొహంపై దిండుతో గట్టిగా అదిమి, ఆమెకు ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆ తరువాత ఏమీ ఎరుగనట్లు తమ గదిలోకి వెళ్లిపోయాడు.
ఉదయం పవిత్ర ఎంతసేపటికీ నిద్ర లేవకపోయేసరికి అత్త లక్ష్మమ్మ, భార్య భువనేశ్వరి మళ్లీ జగదీష్ నే పిలిచి చెప్పారు. దీంతో ఆమె స్పృహలో లేదని, చిత్తూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లడం అవసరమని వారికి మాయమాటలు చెప్పిన జగదీష్ పవిత్ర మృతదేహాన్ని కారు వెనక సీటులో పెట్టుకుని బయలుదేరాడు.
కొంతదూరం వెళ్లిన తరువాత పవిత్ర చనిపోయిందంటూ వారికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పవిత్ర తల్లి, అక్క ఘొల్లుమన్నారు. తన మీద అనుమానం రాకుండా ఉండడం కోసం అతడు కూడా వలవలా ఏడ్చాడు.
అయితే ఎన్నడూ మూర్చ రాని పవిత్రకు ఆరోజు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులు వద్ద వాపోగా, పోలీసులకు జగదీష్ ప్రవర్తను అనుమానాస్పదంగా తోచింది.
అతడ్ని ప్రశ్నిస్తే.. ఒక్కోసారి ఒక్కోరకంగా సమాధానాలు ఇస్తుండడంతో పోలీసులు అతడ్ని తమ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో జగదీష్ అసలు విషయం కక్కేశాడు. ఈ కేసులో ఇంకా పోలీసు దర్యాప్తు జరుగుతూ ఉంది.












Click it and Unblock the Notifications