మణిపూర్ బీరేన్ సింగ్ సర్కారు షాక్: మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ మిత్రపక్షం
ఇంఫాల్: రాష్ట్రంలో ఓ వైపు అల్లర్లు కొనసాగుతుండగా.. మణిపూర్‌లోని బీరేంద్ర సింగ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. గత మూడు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో రెండు జాతుల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు బీజేపీ మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయన్స్(కేవీఏ) ప్రకటించింది.
కాగా, కుకీ పీపుల్స్ అలయెన్స్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు అధికార పక్షానికి దూరమవుతున్నట్లు ప్రకటిస్తూ కేపీఏ ఓ లేఖను మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికీకి పంపంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో రగులుతున్న జ్వాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడం ఫలప్రదంగా కనిపించడం లేదని పేర్కొంది.

అందువల్లే మణిపూర్ ఎన్డీఏ ప్రభుత్వానికి కేపీఏ మద్దతు ఉపసంహరించుకుంటోంది అని కేపీఏ అధ్యక్షుడు టోగ్మాంగ్ హకిప్ లేఖలో వెల్లడించారు. అయితే, ఈ చర్య వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని విశ్లేషకులు చెబుతున్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో బీజేపీ-ఎన్డీఏకి 32 మంది ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. మరోవైపు, ఆగస్టు 21 నుంచి జరగనున్న మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు కీలకంగా మారాయి. ఘర్షణలు కొనసాగుతున్న క్రమంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది ఇలావుండగా, మణిపూర్‌లో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన నేపథ్యంలో ఐదుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జులై 19న వీడియో వైరల్ అయిన వెంటనే తౌబల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 3న విష్ణుపూర్‌లో ఆయుధాల దోపిడీకి దారి తీసిన ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ స్థాయి అధికారి కాల పరిమితితో కూడిన విచారణ చేయనున్నారు. ప్రస్తుతం దోపిడీకి గురైన ఆయుధాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications