భద్రతా బలగాలను ముట్టడించిన 1500 మహిళల గుంపు: 12 మంది మిలిటెంట్ల విడుదల
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సైన్యం అదుపులోకి తీసుకున్న పలువురు మిలిటెంట్లను విడిపించేందుకు ఏకంగా 1500 మంది వరకు మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టాయి. దీంతో పౌరుల భద్రత దృష్ట్యా మానవతా దృక్పథంతో వారిని విడిచిపెట్టినట్లు సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. తూర్పు ఇంఫాల్‌లోని ఇథం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నిఘా వర్గాల సమాచారంతో గ్రామంలో సైన్యం శనివారం ఓ ఆపరేషన్ నిర్వహించింది. తనిఖీల్లో భాగంగా మైతేయ్ మిలిటెంట్ గ్రూప్ 'కేవైకేఎల్'కి చెందిన 12 మంది మిలిటెంట్లను అదుపులోకి తీసుకుంది. 2015లో 6 డోగ్రా యూనిట్‌పై ఆకస్మిక దాడితో సహా అనేక ఘటనల్లో ఈ బృందం హస్తం ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు పెద్ద ఎత్తున ఆయుధాలనూ స్వాధీనం చేసుకుంది.

అయితే, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దాదాపు 1200 నుంచి 1500 మంది మహిళలు సైన్యాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరినా.. ఫలితం లేకపోయింది. ఇలా ఇరువర్గాల మధ్య రోజంతా ప్రతిష్టంభన కొనసాగింది.
చివరకు సైన్యం ఆ 12 మంది మిలిటెంట్లను విడిచిపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న సున్నిత పరిస్థితుల నేపథ్యంలో ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ వెల్లడించింది. అయితే, స్వాదీనం చేసుకున్న ఆయుధాలను తరలించినట్లు పేర్కొంది.
కాగా, మణిపూర్ హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ రాష్ట్ర పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర బలగాలు భారీగా మోహరించి శాంతిభద్రతలను కాపాడుతున్నాయి.












Click it and Unblock the Notifications