రంగంలో దిగిన సుప్రీంకోర్టు..!!
న్యూఢిల్లీ: మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు కొలిక్కి రావట్లేదు. అక్కడి పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉంటోన్నాయి. మూడు నెలలుగా ఈ రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది.
మణిపూర్‌లో నెలకొన్న అశాంతియుత వాతావరణం, రోజుల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఘాటుగా స్పందించింది. మణిపూర్ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై ఇవ్వాళ వాడివేడిగా వాదనలు కొనసాగాయి. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లన్నీ తప్పుల తడకగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు మండిపడింది.

మణిపూర్ డీజీపీపైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో ఎన్నో లోపాలు ఉన్నాయని, దీనిపై ఆ రాష్ట్ర డీజీపీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంఘటన జరిగిన తేదీ, జీరో ఎఫ్‌ఐఆర్, సాధారణ ఎఫ్‌ఐఆర్, సాక్షుల వాంగ్మూలాల నమోదు, సెక్షన్ 164 సీఆర్పీసీ కింద స్టేట్‌మెంట్ రికార్డ్ చేసీన తేదీలన్నీ పొంతన లేకుండా ఉన్నాయని పేర్కొంది.
ఈ అల్లర్లపై విచారణ జరిపించడానికి సుప్రీంకోర్టు ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ న్యాయమూర్తులు జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ షాలినీ జోషి, జస్టిస్ ఆశా మీనన్ ఇందులో సభ్యులుగా ఉంటారు. జస్టిస్ గీతా మిట్టల్ ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.
మణిపూర్ హింసాకాండపై సమగ్ర విచారణ జరిపించడం, బాధితులకు నష్టపరిహారం చెల్లింపులు, దాడుల నివారణ చర్యలు, పునరావాసం తదితర అంశాలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఉదంతాన్ని ఇదివరకే సీబీఐకి బదిలీ చేశామని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇందులో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ గల అయిదుమంది ఐపీఎస్ అధికారులను నియమించాలని ఆదేశించారు. సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిపించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. సీబీఐకి బదిలీ చేయని కేసులను 42 ప్రత్యేక దర్యాప్తు కమిటీలు దర్యాప్తు జరుపుతాయని సుప్రీంకోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications