చేసింది చెప్పేందుకు టైంలేదు: ప్రధాని, ఇక రాహులే..
న్యూఢిల్లీ: తాము గత తొమ్మిదేళ్లలో ఎంతో చేశామని కానీ, దానిని విపులంగా చెప్పేందుకు సమయం లేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాని మాట్లాడారు. గత పదేళ్లలో ప్రధానిది ఇది మూడో ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రధాని పార్టీలో కొత్త తరం వస్తుందని వ్యాఖ్యానించారు. తద్వారా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెసు త్వరలో ప్రకటిస్తుందని భావించవచ్చు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుండి బయటపడుతున్నాయన్నారు. ఇటీవల ఎన్నికల్లో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం ప్రజలకు ప్రజాస్వామ్యం పైన పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. భారత అభివృద్ధి క్రమంగా పట్టాల పైకి వస్తోందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏ ఒక్క వ్యక్తికో పరిమితం కాదని జన చైతన్యమే మూలాధారమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనకు గత తొమ్మిదేళ్లుగా యూపిఏ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. గ్రామీణ ప్రాంత వేతనాల్లో గతంతో పోలిస్తే అధిక వృద్ధి జరిగిందన్నారు.

గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయ వృద్ధి పెరిగిందన్నారు. అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలను సమ్మిళితం చేసిన ఘనత తమదే అన్నారు. విద్యారంగంలో కొత్త విశ్వవిద్యాలయాలు, సాంకేతిక శిక్షణా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ఇప్పుడు చెప్పేందుకు సమయం తక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. తయారీ రంగంలో ఉపాధి కల్పనను టార్గెట్ రీచ్ కాలేకపోయామని, ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోందన్నారు.
యుపిఏ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. 2జి స్పెక్ట్రం, బొగ్గు గనుల కేటాయింపుల అంశాల్లో గత విధానాలనే అనుసరించామని, పొరపాట్లను సరిదిద్దుతున్నామన్నారు. ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొనే తాము ఆహార భద్రత బిల్లును తీసుకు వచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గుతోందన్నారు. పార్టీ యువ నాయకత్వం కొత్త తరం ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పని చేస్తుందని భావిస్తున్నానని ప్రధాని అన్నారు.
తనకు రాజీనామా చేయాలని ఎప్పుడూ అనిపించలేదని, రాగద్వేషాలకు అతీతంగా పని చేశానని చెప్పారు. ధరల పెరుగుదల కొన్ని సందర్భాల్లో తమ నియంత్రణలో లేకుండా పోయిందన్నారు. ధరల పెరుగుదల కాంగ్రెసును ప్రజలకు దూరం చేసిందన్నారు. యూపిఏ 3 గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. ధరల పెరుగుదల నుండి బలహీన వర్గాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పైన అరుణ్ జైట్లీ రాసిన లేఖను చదివేందుకు ఇంకా సమయం దొరకలేదన్నారు.
కొత్త ప్రధానికి బాధ్యత
సాధారణ ఎన్నికల అనంతరం తాను కొత్త వారికి ప్రధానమంత్రి బాధ్యతలను అప్పగిస్తానని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఎన్నికల అనంతరం యూపిఏ కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు. మా పార్టీ కొత్త తరం నాయకత్వం భారత దేశానికి మార్గనిర్దేశనం చేస్తుందన్నారు. సరైన సమయంలో తమ పార్టీ ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తుందన్నారు. తద్వారా 2014 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని కాంగ్రెసు భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది. రాహుల్ గాంధీ సమర్థుడైన నాయకుడని, సరైన సమయంలో తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రధాని పదవికి రాహుల్ గాంధీకి అన్ని అర్హతలున్నాయన్నారు.












Click it and Unblock the Notifications