పెళ్లైన కొత్తలో: ఆ నవ దంపతుల స్ఫూర్తి అమోఘం: మోడీ: ప్రధాని దృష్టిలో పడటానికి కారణం?
న్యూఢిల్లీ: భారత్‌కు యువత అత్యంత ప్రధాన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్, స్టార్టప్ వంటి రంగాలను ముందుకు తీసుకెళ్లగల శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం వద్ద కొందరు యువకులు ఓ ప్రాచీన వీరభద్రస్వామి వారి ఆలయాన్ని పునరుద్ధరించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. దాదాపు శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని జీర్ణోద్ధరించిన ప్రక్రియ అద్భుతమని అన్నారు. సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, కొత్త సంవత్సరంలో వాటిని వినియోగించబోమని యువత ప్రతిజ్ఞ చేయాలని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు.

పర్యావరణ పరిరక్షణ యువత బాధ్యత..
తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రధాని.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త ఏడాదిలో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ప్రస్తావించారు. దేశాన్ని ముందుండి నడిపించాల్సిన యువత.. కొన్ని రకాల సామాజిక బాధ్యతలను తమ భుజస్కందాల మీద వేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే పర్యావరణనాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు.

కర్ణాటకకు చెందిన నవ దంపతుల గురించి..
ఈ సందర్భంగా ఆయన.. కర్ణాటకకే చెందిన యువ దంపతులు అనుదీప్, మినూషా చేపట్టిన కార్యక్రమం గురించి ప్రస్తావించారు. అనుదీప్, మినూషా కిందటి నెలలోనే పెళ్లి చేసుకున్నారని, పెళ్లైన కొత్తలోనే వారు అందరిలా పర్యాటక కేంద్రాలను సందర్శించడానికి వెళ్లలేదని, దాని స్థానంలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. పర్యాటక కేంద్రాలను సందర్శించడానికి వెళ్లే వారు తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ వస్తువులు, ఇతర ఆహార పదార్థాలను ఇష్టానుసారంగా పడేస్తుంటారని విషయాన్ని గుర్తించారని, వాటిని తొలగించడానికి నడుం బిగించారని అన్నారు.

800 కేజీలకు పైగా చెత్త..
కర్ణాటకలోని సోమేశ్వర్ బీచ్‌పై పోగైన చెత్తను వారు తొలగించారని అన్నారు. పెళ్లైన కొత్తలోనే ఇలాంటి ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం తనను ఆకర్షించిందని మోడీ వ్యాఖ్యానించారు. తాము చేస్తోన్న పనులను సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేశారని, ఫలితంగా.. పలువురు యువతీ యువకులు వారితో జత కలిశారని అన్నారు. వారంతా కలిసి 800 వందలకు పైగా చెత్తను తొలగించారని, ఇది గొప్ప విషయమని మోడీ చెప్పారు. పర్యాటక కేంద్రాల వద్ద పోగైన చెత్తను తొలగించాలనే ప్రతిజ్ఙను ప్రతి పౌరుడూ తీసుకోవాలని అన్నారు.

ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లొద్దు..
అలాగే- పర్యాటక కేంద్రాలకు తాము ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లబోమంటూ స్వీయ నిర్ణయాన్ని తీసుకోవాలని మోడీ సూచించారు. ఇది వరకు తాను చెత్తను తొలగించిన విషయాన్ని కూడా మోడీ ఈ సందర్భంగా ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇలాంటి సామాజిక బాధ్యత ప్రతి పౌరుడిలోనూ కనిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాంటి వారిలో చైతన్యాన్ని, అవగాహనను నింపడానికే తమ ప్రభుత్వం ఇదివరకు స్వచ్ఛభారత్ అభియాన్‌ను ప్రారంభించిందని చెప్పారు.












Click it and Unblock the Notifications