వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మను స్మృతి: మహిళల గురించి మనుస్మృతి ఏం చెప్తోంది? 2000 ఏళ్ల నాటి ఈ హిందూ నియమావళిని నేటి భారత మహిళలు పాటించాలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మను స్మృతి

"ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు" - మను స్మృతిలోని ఈ మాటలను వినగానే ఈ నియమావళి మహిళలకు అత్యున్నత స్థానం ఇమ్మని చెప్పిందనే భావన కలగడం సహజం.

కానీ, మనుస్మృతిలో మహిళలకు నిర్దేశించిన కొన్ని నియమాలు మాత్రం ఈ శాస్త్రాన్ని ప్రశ్నించేలా చేస్తూ ఉంటాయి.

"స్త్రీ ఎప్పుడూ తండ్రి, భర్త లేదా కొడుకు సంరక్షణలో ఉండాలని, స్త్రీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకూడదని, వేధించి హింసించే భర్తను కూడా పూజించాలి" అని చెప్పే కొన్ని నియమాలు స్త్రీ అణచివేతను పురుషాధిక్యతను సూచిస్తూ ఉంటాయి.

ఇవన్నీ వింటున్నప్పుడు 2000 సంవత్సరాల కిందటి మను స్మృతిలోని సూత్రాలు.. నేటికీ భారత సమాజంలో మహిళలపై కొనసాగుతున్న హింసను, వేధింపులను సమర్ధిస్తున్నాయా? పితృస్వామ్య ధోరణిని బలపరుస్తున్నాయా? అనే ఆలోచనలు రాక మానవు. ఏ పరిస్థితుల్లోనైనా స్త్రీయే సర్దుకుపోవాలనే భావనకు మను స్మృతే ఆధారమా?

మను స్మృతికి 21వ శతాబ్దంలో ప్రాముఖ్యత ఎంత? ఈ స్మృతి గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడెందుకొచ్చింది?

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభ సింగ్ ఇటీవల ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) వైజ్ కౌన్సిల్ (విమెన్ ఇన్ సైన్స్ అండ్ ఎంట్రపెన్యూర్‌షిప్ నిర్వహించిన సదస్సులో మాట్లాడారు.

'మహిళలు సైన్స్, టెక్నాలజీ, గణితం, వ్యాపార రంగాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లు' అనే అంశంపై ఆమె ప్రసంగించారు.

ఈ ప్రసంగంలో భాగంగా ఆమె మను స్మృతిని ప్రస్తావించారు. మను స్మృతి లాంటి గ్రంథాలు స్త్రీకి చాలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాయని అన్నారు. ఆమె ప్రసంగంలో మాట్లాడిన అంశాలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

2020లో తమిళనాడులో విదుత్తలై చిరుతైగల్ కాచ్చి (వీసీకే) అధినేత ఒక ఆన్‌లైన్ వెబినార్‌లో మను స్మృతి పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నటి, బీజేపీ సభ్యురాలు ఖుష్బూ చెన్నైలో ఒక ర్యాలీని కూడా నిర్వహించారు.

ఈ ర్యాలీ ఇస్తున్న సందేశం ఏంటి? ఈ ప్రశ్నలు తలెత్తక మానవు. ఆధునిక కాలానికి మనుస్మృతి ఎంత వరకు పనికొస్తుంది?

ప్రతీకాత్మక చిత్రం

ఇంతకీ ప్రతిభా సింగ్ ఏమన్నారు?

ఆసియా దేశాల్లో ఉన్న మతపరమైన సాంస్కృతిక నేపథ్యం వల్ల మహిళలకు ఎక్కువ గౌరవం లభిస్తుందని అంటూ మహిళలకు తగిన గౌరవం దక్కలేనప్పుడు ఆమెను ప్రత్యేకంగా పూజించడంలో ఎటువంటి ప్రయోజనం లేదని ప్రతిభ సింగ్ అన్నారు.

"మహిళలు భారతీయ కుటుంబ వ్యవస్థ విలువలను బలపరిచి, ఉమ్మడి కుటుంబాల్లో ఉండటం వల్ల తమ కెరీర్ బలపరుచుకోవచ్చు’’ అని సూచించారు.

"అలా చేయడం వల్ల పనిని విభజించుకోవచ్చు. నా స్పేస్ నాకు కావాలి అని చెబుతూ స్వార్ధంగా ఉండాల్సిన అవసరం లేదు. మహిళలు కాస్త సర్దుకుని బ్రతకడం వల్ల న్యూక్లియర్ కుటుంబం కంటే కూడా ఉమ్మడి కుటుంబం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి" అని అభిప్రాయపడ్డారు.

"మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉండటంలో భారత్ చాలా ముందంజలో ఉంది. అట్టడుగు స్థాయిల్లో మహిళలపై జరుగుతున్నా హింస, అకృత్యాలను పట్టించుకోవద్దని నేను చెప్పడం లేదు. కానీ, మహిళలు మధ్య తరగతి, ఎగువ వర్గాల్లో ప్రగతి పథంలో పయనిస్తున్నారు" అని చెప్పారు.

"మహిళలు ఎవరి నుంచి సానుభూతిని ఆశించకూడదు. 'నా పిల్లలకు ఆరోగ్యం బాలేదు. నేను ఇంటికి వెళ్ళాలి. నేనొక ప్రత్యేకమైన పనిని మాత్రమే చేస్తాను’ అని చెప్పకండి. మహిళలు సెలవు తీసుకోవచ్చు. కానీ, కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీకొక వ్యక్తిగత సమస్య వచ్చిందని మాత్రం చెప్పండి" అని ఆమె సూచించారు.

"ఇంట్లో పనులు చూసుకునేందుకు పని వాళ్ళను పెట్టుకోవడం వల్ల ఇంటి పనులు చేసే ఒత్తిడి తగ్గుతుంది" అని కూడా చెప్పారు.

ఇవన్నీ చెబుతూ, మను స్మృతి గురించి ఆమె చేసిన ప్రస్తావన పలువురి స్త్రీ ఉద్యమకారులకు ఆగ్రహం తెప్పించింది.

జైపూర్ హైకోర్టు ఎదుట మనువు విగ్రహం

మను స్మృతి అంటే ఏంటి?

మను స్మృతి 2000 సంవత్సరాల కిందట క్రీస్తు పూర్వం రెండు, మూడు దశాబ్దాలలో రచించిన ఒక ప్రాచీన హిందూ ధర్మ నియమావళి.

మనువు అనే రుషి ప్రధానంగా రాసినట్లు చెప్తున్న ఈ గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు, 2,684 శ్లోకాలు ఉన్నాయని చరిత్రకారుడు నరహర్ కురుంద్కర్ (1932-1982) తెలిపారు.

ఈ నియమవాళిని మను ధర్మ శాస్త్రం లేదా మానవ ధర్మ శాస్త్రం అని పిలుస్తారు. ఇందులో గృహ, సామాజిక, మతపరమైన నియమాలు ఉంటాయి. మను స్మృతిలోని ఐదో అధ్యాయంలో మహిళల బాధ్యతల గురించి ప్రస్తావించారు.

స్త్రీలకు మను స్మృతి అత్యంత ఉన్నత స్థానాన్ని ఇచ్చిందని సంప్రదాయవాదులు అంటారు.

ఈ గ్రంథం పితృస్వామ్యాన్ని బలపరుస్తుందని స్త్రీ హక్కుల ఉద్యమకారులు అంటారు.

మను స్మృతిని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బహిరంగంగా తగులబెట్టారు

ప్రశంసలు, విమర్శలు

''మనుస్మృతి సమర్థకులు ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడని అంటారు. ప్రజాపతి-మనువు-భృగువుల సాంప్రదాయం నుంచి ఈ ప్రాపంచిక విధానం ఏర్పడిందని అంటారు. అందువల్ల అందరూ దానిని గౌరవించాలని ఒక బృందం అంటుంది'' అని కురుంద్కర్ చెప్పారు.

నిత్య జీవితంలో చేయాల్సిన, చేయకూడని పనుల గురించి మను స్మృతి విలువైన పాఠాలను నేర్పిస్తుందని, దీనిని విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చాలని ప్రొఫెసర్ బి ఆర్ గోపాల్ ది హిందూ పత్రికలో రాసిన వ్యాసంలో జులై 2022లో పేర్కొన్నారు.

అయితే దీనిని నిశితంగా అర్ధం చేసుకుని ఆధునిక కాలానికి పనికి రాని వాటిని తొలగించాలని కూడా ఆయన చెప్పారు. ఈ బాధ్యతను టీచర్లు తీసుకోవాలని అన్నారు. వీటిని అమలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని పిల్లల ప్రవర్తనను కూడా దగ్గరగా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.

మనువు చాలా గొప్ప న్యాయ పండితుడని, అందుకే రాజస్థాన్ హైకోర్టు ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారని కొందరు అంటారు.

1927 డిసెంబర్ 25 వ తేదీన మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న మహద్ అనే పట్టణంలో 'బాబా సాహెబ్' డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్.. అంటరానితనం నిర్మూలనకు కృషిచేస్తున్న కార్యకర్తలు, బౌద్ధభిక్షువుల సమక్షంలో 'మనుస్మృతి'ని బహిరంగంగా తగులబెట్టారు.

''మనువు చతుర్వర్ణాలను ప్రవచించారు. వాటిని పవిత్రంగా కాపాడాలని వర్ణ వ్యవస్థను సమర్థించారు. మనువే వర్ణవ్యవస్థను సృష్టించాడని చెప్పలేం కానీ, దానికి విత్తనాలను నాటింది మాత్రం ఆయనే'' అని అంబేడ్కర్ తన 'ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం'లో పేర్కొన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

మహిళల గురించి మను స్మృతి ఏమి చెబుతుంది?

మను స్మృతిలోని 5వ అధ్యాయంలో స్త్రీల కోసం చాలా నియమాలను పొందుపరిచింది.

"ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు" అని మనుస్మృతి చెబుతుంది.

"స్త్రీ ఏ పనినీ సొంతంగా చేయకూడదు. చిన్న వయసులో తండ్రి సంరక్షణలో, యుక్త వయసులో భర్త నీడలో, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలి. స్త్రీ స్వతంత్రంగా ఉండకూడదు" (చాప్టర్ 5: 148, 149) అని నిర్దేశిస్తుంది.

ఇంకా ''స్త్రీ స్వభావం పురుషుడిని వశపరుచుకోవడం. తెలివైన వ్యక్తులు ఒంటరిగా ఉన్న మహిళతో ఉండకూడదు. తెలివైన పురుషులు తల్లి, చెల్లి, కూతురితో కూడా ఒంటరిగా గడపకూడదు. శారీరక కోరికలు నిగ్రహం లేకుండా చేయవచ్చు’’ అని కూడా మనుస్మృతి చెప్తుంది.

''వివాహేతర సంబంధాలున్న స్త్రీ నుంచి, లేదా స్త్రీలు పెత్తనం చెలాయించే కుటుంబం నుంచి ఆహారం స్వీకరించకూడదు’’ అని నిర్దేశిస్తుంది.

''స్త్రీలు స్వతంత్రంగా పని చేయడం గాని, నిర్ణయాలు తీసుకోవడం గాని చేయకూడద’’ని ఆంక్షలు పెడుతుంది.

''పురుషులు అనైతికంగా, విచ్చలవిడి లైంగిక అలవాట్లు ఇతర దుర్లక్షణాలతో ఉన్నప్పటికీ.. స్త్రీ భర్తను పూజించాల్సిందే’’ అని మనుస్మ‌‌ృతిలోని 154వ శ్లోకం చెబుతోంది.

''పురుషుడు భార్య చనిపోగానే వైదిక క్రతువులు నిర్వహించేందుకు వెంటనే వివాహం చేసుకోవాలి కానీ భార్య మాత్రం జీవితాంతం విధవరాలిగానే ఉండాలి’’ అని ఐదో చాప్టర్‌లోని 168వ శ్లోకం ఆదేశిస్తుంది.

''ఒక భార్య పిల్లల్ని కనని 8 ఏళ్ల తర్వాత ఆమెను వదిలిపెట్టవచ్చు. పుట్టిన పిల్లలు మరణిస్తే 10 ఏళ్ల తర్వాత, కూతుర్లకు మాత్రమే జన్మనిస్తే 11 ఏళ్లకు వదిలిపెట్టవచ్చు. భర్తతో తగాదాలు పెట్టుకునే స్త్రీని వెంటనే వదిలిపెట్టేయవచ్చు’’ అని మనుస్మృతి చెప్తుంది.

అలాగే.. 24 - 30 సంవత్సరాల వయసున్న పురుషులు 8 - 12 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సూచిస్తుంది.

పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే భార్యను వదిలేయవచ్చు లేదా భార్య గయ్యాళి లేదా మానసిక స్థితి సరిగ్గా లేనిది అని అనిపించినా చాలు వదిలివేయవచ్చునని (మనుస్మృతి 9-81) చెప్తుంది.

మను స్మృతిలో మహిళల కోసం పొందుపరిచిన ఈ నియమాలు ఆధునిక సమాజానికి ఎంత వరకు వర్తిస్తాయి అనే అంశంపై బీబీసీ పలువురు నిపుణులు, రచయితలతో మాట్లాడింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన స్పందనలను పరిశీలించింది.

"మను స్మృతిలోని నియమాలు మనువుకు స్త్రీల పట్ల వివక్ష ఉందని అనేందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ’’ అని 'మను స్మృతి - ఒక పరిచయం' పుస్తక రచయత రవీంద్రనాథ్ ముత్తేవి అంటారు. ఇవన్నీ పురుషాధిక్య సమాజపు దుర్నీతిలో భాగమేనని చెప్తారు.

"ఇది కూడా ఇస్లామిక్ షరియా ప్రకారం తనకు నచ్చని భార్యకు తోచినప్పుడు 'తలాక్ ' చెప్పేందుకు పురుషులకు కల్పించిన వెసులుబాటు వంటిదే" అని ఆయన వ్యాఖ్యానించారు.

చరిత్రను పరిశీలిస్తే, వేటకు వెళ్లే శక్తి ఉన్నవారు సమాజాన్ని శాసించారని తెలుస్తుంది. స్త్రీలు గర్భంతో ఉండే కాలాన్ని పావుగా చేసుకుని వారిని శక్తిహీనులుగా, నిర్ణయాత్మక శక్తి లేని వారిగా నిర్ణయించారని రవీంద్రనాథ్ అన్నారు.

శాస్త్రీయ దృక్పథం కలిగినవారు, సామాజిక అభ్యున్నతిని కోరుకునే ప్రగతిశీలురు అందరూ ఈ అనాగరిక, అమానవీయ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాలి అంటూ నే.. మను ధర్మంలో కూడా చీకటి, వెలుగు కోణాలు ఉంటాయన్నారు.

అందులో చెప్పిన ప్రతీ విషయాన్నీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదని రవీంద్రనాథ్ అభిప్రాయపడ్డారు.

మను స్మృతిని మహిళలకు గౌరవాన్ని ఇచ్చే ధర్మంగా పేర్కొనడం దారుణమని కమ్మూనిస్టు ఫెమినిస్ట్, ఫియర్ లెస్ ఫ్రీడమ్ పుస్తక రచయత కవిత కృష్ణన్ అన్నారు.

https://twitter.com/kavita_krishnan/status/1557657426836332544

దేశంలో మహిళల హక్కులు జస్టిస్ ప్రతిభా సింగ్ లాంటి న్యాయమూర్తుల చేతుల్లో ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

''మహిళా న్యాయవాదులు మంచి భార్యలుగా ఉంటారనడంలో ఆమె ఉద్దేశం ఏంటి? న్యాయ వ్యవస్థలో ఉన్న సమస్యలను తెలుసుకుని భర్త పైన, కుటుంబంతోనూ ఎటువంటి వివాదాలకు పాల్పడకుండా ఉంటారని ఆమె ఉద్దేశమా?’’ అని ప్రశ్నించారు.

ఇలాంటి పితృస్వామ్య భావాలను ప్రజల్లో నాటాలని అనుకోవడం విచారకరమన్నారు.

రమా రావి

ఆధునిక సమాజంలో మను ధర్మ శాస్త్రం పని చేస్తుందా?

"మను స్మృతి ఆధునిక కాలానికి వర్తించదు. దీనిని పాటించాల్సిన అవసరం లేదు" అని హైదరాబాద్‌కు చెందిన స్టోరీ టెల్లర్ రమా రావి అన్నారు.

'భర్త ఎంత వ్యసనపరుడైన భార్య వదిలిపెట్టకూడదా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, " 2000 సంవత్సరాల క్రితం పురుషులకు స్త్రీ లోలత్వం ఉండేది. గర్భ నియంత్రణ ఉన్న రోజులు కాదు. భర్త వ్యసనపరుడైనా వదిలిపెట్టవద్దని చెప్పడానికి ఆమెకు విద్య ఉండేది కాదు. ఆస్తి హక్కు లేదు. అలాంటి పరిస్థితిలో బయటకు వెళితే రక్షణ లేదని అలా చెప్పి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.

"ఒక పురుషుడు పరాయి స్త్రీ వ్యామోహంలో పడి భార్యను వదిలిపెట్టాడు అని చెప్పినప్పుడు, ఆ తప్పులో మరొక స్త్రీకి కూడా భాగం ఉన్నట్లే. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇలాంటి చోట స్త్రీకి వశపర్చుకునే స్వభావం ఉన్నట్లే కదా" అని అన్నారు.

"బాల్య వివాహాలు చేసేవారు. పెళ్ళైన తర్వాత పుట్టింటికి వెళ్లే అవకాశం కూడా ఉండేది కాదు. భార్య బాధ్యత పూర్తిగా భర్త పైనే ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను వదిలిపెట్టకూడదనే నియమం పురుషులకు కూడా ఉండేది. బహు భార్యత్వం ఆ రోజుల్లో సహజం. కానీ, ఏ ఒక్క భార్యను కూడా నిర్లక్ష్యం చేసేందుకు లేదు" అని ఆమె విశ్లేషించారు.

"ఆధునిక కాలంలో వ్యసనపరుడిని భరించాల్సిన అవసరం లేదు. ఆధునిక కాలానికి మను స్మృతి వర్తించదు. ఆ నాటి సామాజిక పరిస్థితులు వేరు. వీటిని తీసుకుని రాజ్యాంగంలోనో, పాఠ్యాంశాల్లోనో పెట్టాల్సిన అవసరం లేదు" అంటూ.. కాలం ముందుకు కదులుతూ పరిణామం చెందుతున్న దశలో పాత కాలం సిద్ధాంతాన్ని తిరిగి ఎందుకు ఆచరించాలని ప్రశ్నించారు.

"స్త్రీని రక్షించాలి అని చెబితే, పురుషుడిని కూడా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించినట్లే కదా! ఇది జరుగుతోందా?" అని ప్రశ్నించారు.

స్త్రీలకు నిర్దేశించిన కొన్ని నియమాలు తెలియకుండానే సమాజంలో, మనస్సులో నాటుకు పోలేదా అని ప్రశ్నించినప్పుడు, అవుననే సమాధానం చెప్పారు.

ఇందుకు ఉదాహరణ చెబుతూ "అమ్మాయి పెళ్లి తర్వాత ఆడ పిల్లే కానీ, ఈడ పిల్ల కాదని, పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చుకోవాలని, కొడుకును కనాలని, స్త్రీ పునర్వివాహం చేసుకోవడం తప్పని ఇలాంటి చాలా భావాలు తెలియకుండానే నాటుకుపోయాయి’’ అని వివరించారు.

''ఇటీవల కొంత మంది సెలబ్రిటీలు రెండవ వివాహం చేసుకున్నప్పుడు లేదా ప్రేమలో ఉన్నామని ప్రకటించినప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలొచ్చాయి. ఇలాంటి ధోరణి నాటుకుపోవడం వల్లే ఇలాంటి విమర్శలకు కారణం’’ అని ఆమె ఉదహరించారు.

"స్త్రీ పునర్వివాహం చేసుకుంటే ఎటువంటి తప్పు లేదు" అని అన్నారు. కానీ, చాలా వరకు సమాజం మారుతోంది, ఆలోచనా ధోరణి కూడా మారుతోంది" అని తెలిపారు.

"మను స్మృతిని నేను సమర్ధించను. 100 ఏళ్ల క్రితం నాటి ఆచారాలనే పాటించని రోజులున్నప్పుడు, 2000 సంవత్సరాల క్రితం నాటి ఆచారాల గురించి చర్చించాల్సిన పని లేదు" అని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

''పరాశర స్మృతి' లోని ఒక శ్లోకం ప్రకారం అసలు 'మనుస్మృతి' లోని ధర్మసూత్రాలు కృతయుగంలో మాత్రమే ఆచరించడానికి సాధ్యమైనవి" అని రవీంద్రనాథ్ ముత్తేవి అంటారు.

"ప్రజాస్వామ్య యుగంలో ప్రజల ఆకాంక్షల మేరకు ధర్మశాస్త్రాలలో ఇంకా మిగిలివున్న పురుషాధిక్యత వంటి అనాగరిక, అమానవీయ, అప్రజాస్వామిక ధోరణులు ఏ మతంలో ఉన్నా అవి సంస్కరించాలి. ఇదొక చారిత్రక ఆవశ్యకత కూడా. భారత రాజ్యాంగం లోని 51 A (h) ప్రకారం సంస్కరణ వాదాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవవాదాన్ని, జిజ్ఞాసనూ అందరూ పెంపొందించుకోవాలి" అని రవీంద్రనాథ్ అన్నారు.

''క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో రచించిన గ్రంథానికి క్రీస్తు శకం 21వ శతాబ్దంలో విలువ లేదు" అని హర్ వంశ్ ముఖియా అనే చరిత్రకారుడు అన్నట్లు ఫ్రంట్‌లైన్ పత్రిక 2017లో 'మను స్మృతి ఇన్ మోదీ ఎరా' లో ప్రచురించిన వ్యాసంలో పేర్కొంది.

"ఇది సమస్యాత్మకం. ఇది బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు రచించిన గ్రంథం. మనువాదం మహిళలు, నిమ్న కులాలపై వివక్షను ప్రోత్సహిస్తోంది. హిందూ సమాజపు మూలాలను, భవిష్యత్తును సమూలంగా అర్ధం చేసుకోవడానికి ఇది ఉపయోగపడింది’’ అని ఆయన పేర్కొన్నారు.

"ఇది అసమానతలను ఆధారంగా చేసుకుని రచించిన గ్రంథం. ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. చాలా గ్రంథాలను ఎవరో చెబితే రాసినవే ఉన్నాయి. ఎంత వరకు వాటిని సరిగ్గా అర్ధం చేసుకున్నామో ప్రశ్నార్థకమే" అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Manu Smriti: What does Manu Smriti say about women? Should the Indian women of today follow this 2000 year old Hindu rule?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X