ట్రక్కును పేల్చేసిన మావోయిస్టులు: ఇద్దరు సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. సుకుమా జిల్లాలో పేలుడు మందుపాతరలతో కోబ్రా జవాన్లు ప్రయాణిస్తున్న ఓ ట్రక్కును ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో సీఆర్పీఎఎఫ్ కోబ్రా యూనిట్‌కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ధృవీకరించారు.
జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) 201వ యూనిట్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ పేలుడు సంభవించిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కానిస్టేబుల్ శైలేంద్ర (29), కేరళకు చెందిన డ్రైవర్ విష్ణు(35) ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

పేలుడు జరిగిన సమయంలో ట్రక్కులో వీరిద్దరే ఉన్నారని తెలిపారు. దాడి సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. జవాన్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకుఅండగా ఉంటామన్నారు.
కాగా బీజాపూర్ జిల్లా నుంచి సిల్గర్ వరకు రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, సిల్గర్ నుంచి టేకలగూడెం వరకు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీంతో మావోయిస్టులు పసిగట్టకుండా ఐఈడీలను అమర్చడం సులువైనట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications