సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మాజీ భార్యను పెళ్లి చేసుకున్న బీజేపీ నేత..!
బీజేపీ నేత, మీరట్ జిల్లా పంచాయత్ చైర్మన్ గౌరవ్ చౌదరి.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాజీ భార్య మోనికా యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఫరూఖాబాద్ జిల్లా పంచాయత్ చైర్‌పర్సన్‌గా ఉన్న మోనికాను ఆయన గురువారం హిమాచల్ ప్రదేశ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య గోప్యంగా పెళ్లాడారు. ఈ పరిణామం ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మోనికా యాదవ్ ప్రముఖ యాదవ్ కుటుంబానికి చెందినవారు. ఆమె 2021లో సమాజ్‌వాదీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. గతంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న ఆమె, అఖిలేశ్‌కు బంధువైన ధర్మేంద్ర యాదవ్ నుంచి 2016లో విడాకులు తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు గౌరవ్ చౌదరికి కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. మొదటి భార్యతో చట్టబద్ధంగా విడిపోయిన తర్వాతే ఆయన మోనికాను పెళ్లాడారు. ఇక సుమారు ఏడాదిగా ఒకరికొకరు పరిచయం ఉన్న గౌరవ్, మోనికా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో తొలిసారిగా కలుసుకున్నారు. అభివృద్ధి, స్థానిక పాలనపై చర్చలు వారిని దగ్గర చేశాయి. ఆ పరిచయం స్నేహంగా మారి, చివరికి వివాహ బంధానికి దారితీసిందని సమాచారం.
మోనికా రాజకీయ నేపథ్యం పటిష్టమైనది. ఆమె తండ్రి నరేంద్ర సింగ్ యాదవ్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. తాత రాజేంద్ర సింగ్ యాదవ్ ప్రముఖ రాజకీయ నేతగా గుర్తింపు పొందారు, ప్రజా సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.
గౌరవ్ చౌదరి ప్రయాణం కూడా ఆసక్తికరమేనని చెబుతున్నారు. మీరట్ జిల్లాలోని కుసేడి గ్రామానికి చెందిన ఆయన 2006లో అంతర్జాతీయ వ్యాపార విద్య కోసం జర్మనీకి వెళ్లారు. అక్కడ హోటల్, రియల్ ఎస్టేట్, హోల్‌సేల్ వ్యాపారాల్లో విజయవంతమయ్యారు. 2021లో భారత్‌కు తిరిగి వచ్చి, కొద్ది నెలల్లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
స్థానిక రాజకీయాల్లో చురుకైన గౌరవ్, మీరట్ జిల్లా పంచాయత్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన వివాహం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications