కోర్బాలో భారీ అగ్ని ప్రమాదం: భవనంపైనుంచి దూకేశారిలా, ముగ్గురు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా(Korba) జిల్లాలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్‌పోర్టు నగర్ ప్రాంతంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భవనమంతా వ్యాపించాయి. దీంతో అందులో చిక్కుకున్న ప్రజలు భయాభ్రాంతులకు గురయ్యారు. బయటికి పరుగులు తీశారు.
ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. భారీగా ఎగిసిపడుతున్న మంటల పక్కనుంచి వారు కిందకు దూకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీగా మంటలు వ్యాపించడంతో భవనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌లో వస్త్ర దుకాణం, ఇండియన్ బ్యాంక్ తోపాటు పలు షాపులున్నాయి. ఇవన్నీ కూడా మంటలో కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతోపాటు కిందికి దూకేసిన పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#korba #tpnagar bhut hi khatrnak manjar pic.twitter.com/m6pgbCGQ6F
— Anmol Mahant (@AnmolMahant3) June 19, 2023
ఇది ఇలావుండగా, ఆదివారం పుణెలోని గంగాధమ్ ప్రాంతంలోని గోడౌన్లలో చెలరేగిన భారీ మంటలను అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి అదుపులోకి తెచ్చారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్న చోట నుంచి దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి.
ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు రానప్పటికీ.. మంటలు చెలరేగడంతో 22 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వివిధ సామాగ్రి ఉన్న 20 నుంచి 25 గోడౌన్లలో మంటలు వ్యాపించాయి. భద్రత దృష్ట్యా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.












Click it and Unblock the Notifications