Mayawati: మాయావతి సంచలన నిర్ణయం.. మేనల్లుడిని అన్ని పార్టీ పదవుల నుంచి తొలగింపు
Mayawati: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశం అనంతరం మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ వారసుడిగా భావిస్తున్న మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆకాశ్ తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్ తో పాటు రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ ను కొత్త జాతీయ స్థాయి సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు మాయావతి పేర్కొన్నారు. ఆదివారం లక్నోలో జరిగిన బీఎస్పీ సమావేశంలో పార్టీలో భారీ మార్పులు చేసినట్లు తెలిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బహుజన్ సమాజ్ పార్టీ సంస్థాగత బలాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించి పార్టీ విభజనకు అశోక్ సిద్దార్థ్ కారణమయ్యారని పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. పార్టీకి, ఉద్యమానికి హాని కలించేందుకు తన పేరును దుర్వినియోగం చేస్తే వారిని వెంటనే తొలగిస్తానని అన్నారు. తాను బతికి ఉన్నంత కాలం పార్టీకి ఎవరూ వారసులు కాలేరని మాయావతి అన్నారు. తన బంధువులను పార్టీలో పనిచేయడానికి తానెప్పుడూ నిరాకరించలేదని.. కానీ వారు కూడా ఇతరుల మాదిరిగానే పార్టీలో పని చేయాలన్నారు. కానీ దీని ముసుగులో తన పేరును దుర్వినియోగం చేస్తే వెంటనే వారిని పార్టీ నుంచి తొలగిస్తామన్నారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయని.. ప్రజలకు ఈ విషయం బాగా తెలుసన్నారు. అశోక్ సిద్ధార్థ్ చర్యలు ఆకాష్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుండడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని బహుజనుల పురోగతికి మాత్రమే కాకుండా దేశ పురోగతికి మార్పు అవసరమని మాయావతి పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications