పీరియడ్ ఫీస్ట్: రుతుస్రావ రోజుల్లో వంటా వార్పు: 28 మందికి పైగా మహిళలతో ఫుడ్ ఎగ్జిబిషన్..!
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం.. రుతుస్రావ రోజులు. రుతుస్రావ రోజుల్లో వంట వండే మహిళలు వచ్చే జన్మలో కుక్కలుగా పుడతారని, దాన్ని భుజించే మగవారు ఎద్దులుగా జన్మిస్తారనీ కృష్ణ స్వరూప్ దాస్‌జీ చేసిన వ్యాఖ్యలపై మహిళలు భగ్గుమంటున్నారు. సహజసిద్ధంగా మహిళలకు సంభవించే రుతుస్రావ రోజులపై కృష్ణ స్వరూప్ ఘాటుగా స్పందించడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఆయన కామెంట్స్‌కు నిరసనగా పీరియడ్ ఫీస్ట్ నిర్వహించారు.
Recommended Video


దేశ రాజధానిలోని మయూర్ విహార్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ ఫుడ్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. 28 మంది మహిళలు తమకు వెరైటీ రుచుల్లో వంట వండి, సందర్శకులకు తినిపించారు ఈ 28 మంది మహిళలు కూడా రుతుస్రావ రోజుల్లో ఉన్న వారే కావడం ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ స్పెషల్ అట్రాక్షన్. ఈ కార్యక్రమానికి ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారు వండి పెట్టిన ఆహారాన్ని రుచి చూశారు. ఒక్కరోజులోనే 300 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు.

ఢిల్లీకి చెందిన సచ్చీ సహేలి అనే స్వచ్ఛంద సంస్థ, అస్మిత థియేటర్ గ్రూప్ ఈ ఎగ్జిబిషన్‌ను సంయుక్తంగా నిర్వహించారు. అస్మిత్ థియేటర్ గ్రూప్ కళాకారులు రుతుస్రావ రోజులపై ఓ నాటికను కూడా ప్రదర్శించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త కమలా భాసిన్, బెన్వాడ విల్సన్, అరవింద్ గౌర్, డాక్టర్ సురభి సింగ్ వంటి ప్రముఖులు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. టేస్టీ ఫుడ్‌ను వండి, సందర్శకులకు వడ్డించారు.

కృష్ణస్వరూప్ దాస్‌జీ చేసిన వ్యాఖ్యల పట్ల కమలా భాసిన్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పురుషాధిక్య సమాజం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పడానికే తాము ఈ ఫుడ్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించినట్లు చెప్పారు. రుతుస్రావం రోజుల్లో మహిళలను గడప దాటి లోనికి రానివ్వకూడదని, వంటగదిలోకి అస్సలు ప్రవేశాన్ని కల్పించకూడదని కృష్ణ స్వరూప్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. రుతుస్రావం రోజుల్లో వంట వండే మహిళలు మరు జన్మలో కుక్కలుగా పుడతారని తన ప్రవచనాల్లో చెప్పడం ఆయన ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని నిలదీశారు.












Click it and Unblock the Notifications