మోడీ లక్ష్యం: కొత్తఆఫర్‌తో సాయానికి సత్య నాదెళ్ల రెడీ
ముంబై: మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్టప్స్ కోసం ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల గురువారం ముంబైలో తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్‌లీష్డ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో పెరిగిపోతున్న సమస్యలను టెక్నాలజీ ద్వారా పరిష్కరిస్తామన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమైన స్మార్ట్ సిటీల అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ సహాయపడుతుందని చెప్పారు. స్టార్టప్‌లను దృష్టిలో పెట్టుకొని క్లౌడ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేస్తామన్నారు. భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యేందుకు తమ సంస్థ సహకరిస్తుందన్నారు.
పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న అన్ని సాంకేతిక సమస్యలూ పరిష్కరించదగ్గవేనని అభిప్రాయపడ్డారు. స్టార్టప్ కంపెనీల కోసం సింగిల్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో క్లౌడ్, మొబిలిటీ సేవల ప్రాధాన్యాన్ని ముందే గుర్తించి, అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఔత్సాహికులకు పిలుపునిచ్చారు.

మైక్రోసాఫ్ట్ ఎటువంటి సాయం అందించాలన్న విషయమై సంస్థ భారత చైర్మన్ భాస్కర్ ప్రమాణిక్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని ఓ అధికారి వివరించారు. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రమాణిక్ చర్చలు జరిపారు.
ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 42 రకాల సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు కొత్త ప్రాజెక్టును సైతం చేపట్టారు. వివిధ ప్రాజెక్టులను చేపట్టే కంపెనీలకు కావాల్సిన అనుమతుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఫడ్నవీస్ కోరినట్టు మైక్రోసాఫ్ట్ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications