మరో వందే భారత్ రైలును ప్రకటించిన కేంద్రం- ఈ రద్దీ రూట్‌లో..!!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య ఇక మరింత పెరగనుంది. ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో ఆ సర్వీసులను ప్రయాణికులకు మరింత చేరువ చేయనుంది. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తోన్న ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు 10 రైళ్లు పట్టాలెక్కాయి.
తాజాగా మరో వందే భారత్ రైలును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ-జైపూర్ మధ్య దీన్ని నడిపించనుంది. వందే భారత్ సిరీస్ లో ఇది 11వ ఎక్స్ ప్రెస్ అవుతుంది. ఏప్రిల్ చివరి వారం నాటికి ఈ రైలు పట్టాలెక్కనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. ఏ తేదీన ఈ కార్యక్రమాన్ని ఖాయం చేశారనేది ఇంకా తెలియరావట్లేదు. ఏప్రిల్ 24 లేదా 25 తేదీల్లో ఈ కార్యక్రమం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఊహించినట్టే.. రాజస్థాన్ కు వందే భారత్ రైలును మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమౌతోన్న కర్ణాటకకు కేంద్రం వందే భారత్ రైలును కేటాయించిన విషయం తెలిసిందే. ఈ రైలు మైసూరు నుంచి చెన్నైకి రాకపోకలు సాగిస్తోంది. అదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల వేళ- తెలంగాణలోనూ ఈ ఎక్స్ ప్రెస్ ను పట్టాలెక్కింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి రాకపోకలు సాగిస్తోంది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. ఇవ్వాళ న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను తనిఖీ చేశారు. ప్రయాణికులకు సౌకర్యాలు, సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ట్రాక్‌లో మార్పులు చేయడం ద్వారా రైళ్ల వేగాన్ని పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం న్యూఢిల్లీ-అజ్మీర్, న్యూఢిల్లీ-జైపూర్ మధ్య గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా పట్టాల సామర్థ్యం ఉందని, దీన్ని 160 కిలోమీటర్లకు పెంచాల్సి ఉందని చెప్పారు.

ఏప్రిల్ చివరివారం నాటికి ఈ పనులను పూర్తి చేస్తామని అన్నారు. పట్టాల సామర్థ్యాన్ని పెంచిన తరువాత న్యూఢిల్లీ-జైపూర్ మధ్య వందే భారత్ రైలును ప్రవేశపెడతామని అన్నారు. ఈ నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని, ఈ ఏడాది చివరి నాటికి 100కు పైగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications