మే నెలలో ఎండల కంటే వానలే ఎక్కువా?
వేసవికాలం అనగానే మండిపోయే ఎండలు, ఉక్కపోత గుర్తొస్తాయి. కానీ, ఈ ఏడాది మే నెల మాత్రం కాస్త వెరైటీగా ఉండబోతోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా విడుదల చేసిన 2026 మే నెల అంచనాల ప్రకారం.. దేశంలో మిశ్రమ వాతావరణం నెలకొననుంది. కొన్ని చోట్ల వానలు దంచికొట్టనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు చుక్కలు చూపించనున్నాయి. ముఖ్యంగా ఈసారి వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా, అంటే దీర్ఘకాల సగటు (LPA) కన్నా 110 శాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి బాంబు పేల్చింది.
సాధారణంగా మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు భయంకరంగా ఉంటాయి. అయితే ఈసారి మెజార్టీ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా ఉండి, కాస్త ఉపశమనం కలిగించనున్నాయి. కానీ, దక్షిణ భారతం, ఈశాన్య మరియు వాయువ్య ప్రాంతాల్లో మాత్రం సూర్యుడు తన ప్రతాపం చూపించనున్నాడు. పగలు ఎండలు సాధారణంగా ఉన్నా, రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం చాలా చోట్ల మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల రాత్రిపూట ఉక్కపోత తప్పకపోవచ్చు.

వడగాల్పుల హెచ్చరిక.. ఎక్కడంటే?
ఎండలు తక్కువగా ఉంటాయని సంతోషపడేలోపే వడగాల్పుల హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. హిమాలయ పాదప్రాంతాలు, తూర్పు తీర ప్రాంతాలు, గుజరాత్ మరియు మహారాష్ట్రలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండి స్పష్టం చేసింది. గతంతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో వడగాల్పుల రోజులు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే తూర్పు మరియు ఈశాన్య భారతంలో మాత్రం వర్షాలు కాస్త మొహం చాటేయవచ్చు.
ఎల్ నినో ఎఫెక్ట్.. రుతుపవనాలపై ప్రభావం?
సముద్ర మట్టాల్లో వస్తున్న మార్పులే ఈ వింత వాతావరణానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో పరిస్థితులు క్రమంగా 'ఎల్ నినో' వైపు మళ్లుతున్నాయి. నైరుతి రుతుపవనాల సమయంలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. అలాగే హిందూ మహాసముద్రంలో 'ఇండియన్ ఓషన్ డైపోల్' ప్రస్తుతం నిలకడగా ఉన్నా, రుతుపవనాల చివరి దశలో ఇది సానుకూల స్థితికి చేరి వర్షాలపై ప్రభావం చూపనుంది.
రైతన్నలకు తీపి కబురు.. చేదు వార్త!
వాతావరణ మార్పులు వ్యవసాయంపై రెండు రకాల ప్రభావం చూపనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల రబీ పంటల కోతలకు ఇబ్బంది ఉండదు. అయితే రాత్రిపూట పెరిగే వేడి, అకాల వడగాల్పులు పంట దిగుబడిని తగ్గించవచ్చు. ఇక కురవబోయే భారీ వర్షాలు నేలలో తేమను పెంచి ఖరీఫ్ సీజన్‌కు మేలు చేస్తాయి. కానీ, కోత దశలో ఉన్న పంటలపై వర్షం పడితే నీటి ముంపు, తెగుళ్ల సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఐఎండి రైతులను అప్రమత్తం చేసింది.
మొత్తానికి, ఈ మే నెలలో ఎండల కంటే వానలే ఎక్కువగా పలకరించేలా ఉన్నాయి. గొడుగును దగ్గర ఉంచుకోవడమే కాకుండా, వడగాల్పుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది!














Click it and Unblock the Notifications