ఎక్కువ పిల్లలను కన్నవారికి రూ. లక్ష బహుమతి: మిజో మంత్రి ఆసక్తికర ప్రకటన
ఐజ్వాల్: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో చైనాను కూడా అధిగమించే అవకాశాలున్నాయని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో జనాభాను నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నిస్తుండగా.. మిజోరంకు చెందిన మంత్రి చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అత్యధిక సంతానం కలిగిన తల్లిదండ్రులకు రూ. లక్ష కానుక
తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న తల్లిదండ్రులకు లక్ష రూపాయల నగదును బహుమతి అందిస్తానని ప్రకటించారు మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రొమావియా. మిజో తెగల్లో జనాభాను పెంచేందుకే తాను ఈ ఆఫర్ ప్రకటించినట్లు చెప్పారు. ఫాదర్స్ డే సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు.

క్షీణిస్తున్న మిజో తెగ జనాభా..
మిజో వర్గంలో జనాభా తగ్గుదల ఆందోళకరంగా మారుతోందని, కొన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఈ జనాభా సరిపోవడం లేదని మంత్రి రాబర్ట్ అభిప్రాయపడ్డారు. మిజో లాంటి గిరిజన తెగలకు ఇది సమస్యగా మారుతోందని, అందుకే ఈ తెగల్లో జనాభా పెంచేందుకు నగదు ప్రోత్సాహం ప్రకటించినట్లు వివరించారు.

అందుకే రూ. లక్ష బహుమతి
తన నియోజకవర్గం ఐజ్వాల్ తూర్పు-2 పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లీ లేదా తండ్రికి రూ. లక్ష నగదు ప్రోత్సాహకంగా అందిస్తానని మంత్రి స్పష్టం చేశారు. నగదు బహుమతితోపాటు ఓ ట్రోఫీ కూడా అందజేస్తామని చెప్పారు. ఇందుకయ్యే ఖర్చును రాబర్ట్ కుమారుడికి చెందిన కన్‌స్ట్రక్షన్ కన్సల్టెన్సీ సంస్థ భరించనున్నట్లు తెలిసింది.

ఎంతమంది పిల్లలనేదానిపై క్లారిటీ ఇవ్వని మంత్రి..
అయితే, అత్యధిక సంతానం ఉంటే ఎంతమంది పిల్లలు అనేది మాత్రం మంత్రి స్పష్టం చెప్పలేదు. కాగా, 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014. దేశంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన రెండో రాష్ట్రం ఇదే. స్కేర్ కిలోమీటర్‌కు కేవలం 52 మందే ఉండటం గమనార్హం. ఇక మొదటి స్థానంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం స్కేర్ కిలోమీటర్‌కు కేవలం 17 మందే నివాసం ఉంటున్నారు. అయితే, మిజోరం పొరుగు రాష్ట్రం అస్సాం మాత్రం జనాభా నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారికి ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టాలు కూడా చేసింది.












Click it and Unblock the Notifications