కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కారు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం (DA) 4 శాతం పెంచింది. దీంతో ఇప్పటి వరకు 46 శాతంగా ఉన్న డీఏ 50 శాతానికి చేరుకున్నట్లయింది. జనవరి 1, 2024 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
తాజా నిర్ణయంతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం తెలిపారు. డీఏ/డీఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ. 12,869 కోట్ల అదనపు భారం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దీని ప్రభావం రూ. 15,014 కోట్లు అని తెలిపారు. సుమారు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఎల్పీజీ రాయితీ పొడిగింపు, మరో ఏడాదిపాటు 300 తగ్గింపు
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉజ్వల లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఉజ్వల లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్ (LPG)పై ఇస్తున్న రాయితీ గడువును పొడిగించింది. ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం రూ. 300 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి(2025 మార్చి వరకు) ఈ రాయితీని వర్తింపజేసింది.
ఏడాదికి 12 సిలిండర్లు వరకు ఈ రాయితీ లభిస్తుంది. మార్చి 31తో ఈ గడువు ముగియనున్నవేళ ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ ఖజానాపై రూ. 12 వేల కోట్ల భారం పడనుందని వివరించారు.












Click it and Unblock the Notifications