Serum పూనావాలాకు వై కేటగిరీ భద్రత -vaccine వేళ మోదీ సర్కార్ కీలక నిర్ణయం -Covishield ధర తగ్గినా
మరో రెండు రోజుల్లో దేశంలో మూడో దశ మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, టీకాల తయారీలో అగ్రగామి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కి సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అధర్ పూనావాలాకు 'వై' కేటగిరీ భద్రత ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది.
వ్యాక్సిన్ల తయారీకి ప్రభుత్వం నుంచి సహకారం, రుణాలు, ఉచితంగానే క్లినికల్ ట్రయల్స్ వంటి ఫాయిదాలు పొందిన సీరం, ఇతర సంస్థలు టీకాలను బహిరంగ మార్కెట్లో భారీ ధరకు విక్రయిస్తుండటం వివాదాస్పదమైంది. మూడు రకాల ధరలు నిర్ణయించడం, సరిపడా టీకాలు అందుబాటులో లేవనే వార్తలతో సీరం సంస్థపై ఒత్తిడి పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధర్ పూనావాలాకు వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ వర్సిటీతో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను భారత్ లో విరివిగా వినియోగిస్తుండటం తెలిసిందే. మే1 నుంచి ప్రారంభం కానున్న మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ లోనూ భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ తోపాటు కొవిషీల్డ్ నూ అదుబాటులో ఉంచనున్నారు. కాగా,
సీరం అధినేత పూనావాలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోడానికి కొద్ది గంటల ముందు.. అధర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే కోవిషీల్డ్ ఒక్కో డోసు ధరను రూ.100 మేరకు తగ్గిస్తున్నట్లు చెప్పారు. అంటే గతంలో రూ.400గా ఉన్న డోసు కొవిషీల్డ్ ఇప్పుడు రూ.300కే రాష్ట్రాలు కొనొచ్చు. కేంద్రానికి మాత్రం పాత లెక్క ప్రకారం రూ.150కే కొవిషీల్డ్ సరఫరా అవుతుందని పూనావాలా పేర్కొన్నారు.
ఈ టీకా విక్రయాల్లో భిన్న ధరలు ఉండడం, రాష్ట్రాలకు అందించే ధరలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై, సీరం ఇనిస్టిట్యూట్‌పై ఒత్తిడి పెరగడంతో ధర తగ్గించక తప్పలేదని అంటున్నారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించే టీకా ధరలు మాత్రమే తగ్గించడం విశేషం.












Click it and Unblock the Notifications