అభిమానుల హల్‌చల్: ఒబామాతో తొలిసారన్న మోడీ
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం అమెరికా పర్యటనకు బయల్దేరుతున్న నేపథ్యంలో అక్కడ ఆయన అభిమానుల సందడి నెలకొంది. మోడీ రాకకోసం అమెరికాలోని మోడీ అభిమానులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 26 నుంచి ఐదు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న మోడీ గురువారం ఇక్కడ్నుంచి బయల్దేరనున్నారు.
చేతులపై భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం టాటూలను వేయించుకుంటున్నారు. అంతేగాక తమ కార్ల నెంబర్ల ప్లేట్లపై మోడీ పిఎం అంటూ రాసేసుకుంటున్నారు. భారతీయులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా, న్యూజెర్సీల్లో ఈ ఉత్సాహకర వాతావరణం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

కాగా, సెప్టెంబర్ 28న ప్రధాని మోడీ ప్రసంగించనున్న అమెరికాలోని మడిసన్ స్వ్కేర్ వద్దకు సుమారు 30వేల మంది హాజరవుతారని ఎన్నారై సంస్థలు చెబుతున్నాయి. అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి మోడీ అభిమానులు ఇక్కడకు రానున్నారని తెలిపాయి. అంతేగాక ఇక్కడకు రానున్న మోడీకి దగ్గరగా కూర్చునేందుకు ఆయన అభిమానులు రూ. 15 లక్షల నుంచి 30లక్షల వరకు చెల్లించేందుకు కూడా సిద్ధపడుతున్నారట.
ఒబామా భేటీ కోసం ఎదురుచూస్తున్నా: మోడీ
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని గురువారం అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోడీ చెప్పారు. భారత జాతీయ అభివృద్ధికి అమెరికాను కీలక భాగస్వామిగా భావిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. ఒబామాను మొదటిసారిగా కలవబోతున్నట్లు మోడీ చెప్పారు. కాగా, అమెరికా పర్యటనలో మొదట న్యూయార్క్ చేరుకుని అక్కడ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మోడీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాషింగ్టన్ వెళ్లి ఒబామాతో సమావేశమవుతారు.












Click it and Unblock the Notifications