కేంద్రానికి బిగ్ షాక్: మళ్లీ లోక్‌సభలో రాహుల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరు వ్యవహారంలో అనర్హత వేటుకు గురైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీకి.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో గుజరాత్ న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై మధ్యంతర స్టేను విధించింది.
ఈ కేసులో గరిష్ఠంగా.. లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటు విధించడానికి గల కారణాలను దిగువ కోర్టు న్యాయమూర్తి వెల్లడించలేకపోయారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున దోషిగా నిర్ధారించే వరకు రాహుల్ గాంధీపై జారీ చేసిన క్రిమినల్ పరువునష్టం దావా ఉత్తర్వులను నిలిపివేయనున్నట్లు ఆదేశించింది.

ఈ తీర్పుతో రాహుల్ గాంధీ మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టడం దాదాపుగా ఖాయమైనట్టే. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఆయన సభలో ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. అత్యంత సంతోషకరమైన రోజుగా అభివర్ణించింది.
మోదీ ఇంటిపేరు వ్యవహారంలో గతంలో రాహుల్ గాంధీని.. సూరత్ న్యాయస్థానంలో దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దీన్ని ఆయన గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. అప్పుడూ అదే తీర్పు వెలువడింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. దీనితో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవ్వాళ సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం వాదనలను ఆలకించింది. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపించారు.
2019 నాటి ఎన్నికల ప్రచార సమయంలో కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ.. మోదీపై విమర్శలు చేశారు. బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుల పేర్లు చివరన మోదీ అని ఎందుకు ఉంది? అంటూ ప్రశ్నించారు. అదే ఇప్పుడు ఆయనపై అనర్హత వేటుకు దారి తీసింది.
మోదీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధీపై గరిష్ఠ స్థాయి శిక్షను ఎందుకు విధించాల్సి వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఏడాది లేదా 11 నెలల శిక్షను విధించినట్లయితే, రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడేది కాదని అభిప్రాయపడింది. అలాగే- రాహుల్ గాంధీకి కూడా కొన్ని సూచనలు చేసింది ధర్మాసనం.
ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ప్రసంగించే సమయంలో సంయమనం పాటించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు సూచించింది. ఒకరిని కించపరిచే పదజాలాన్ని వాడటం మంచిది కాదని హితవు పలికింది. క్రిమినల్ డిఫర్మేషన్ కేసులో గరిష్ఠంగా శిక్షను విధించడానికి గల సంతృప్తికర కారణాలను ట్రయల్ కోర్టు వెల్లడించలేకపోయిందని పేర్కొంది.
రాహుల్ గాంధీకి ప్రజా జీవితంలో కొనసాగే హక్కు ఉందని, దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆయనను ఎన్నుకున్న ఓటర్ల హక్కును కూడా ప్రభావితం చేసినట్లుగా భావిస్తోన్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే కొనసాగుతుందని వివరించింది.












Click it and Unblock the Notifications