రాహుల్‌పై స్పీకర్ విచక్షణాధికారాల ప్రయోగం: మోదీ సర్కార్‌పై అవిశ్వాసం వేళ..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరు వ్యవహారంలో అనర్హత వేటుకు గురైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీకి.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో గుజరాత్ న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై మధ్యంతర స్టేను విధించింది.
ఈ కేసులో గరిష్ఠంగా.. లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటు విధించడానికి గల కారణాలను దిగువ కోర్టు న్యాయమూర్తి వెల్లడించలేకపోయారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున దోషిగా నిర్ధారించే వరకు రాహుల్ గాంధీపై జారీ చేసిన క్రిమినల్ పరువునష్టం దావా ఉత్తర్వులను నిలిపివేయనున్నట్లు ఆదేశించింది.

మోదీ ఇంటిపేరు వ్యవహారంలో గతంలో రాహుల్ గాంధీని.. సూరత్ న్యాయస్థానంలో దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దీన్ని ఆయన గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. అప్పుడూ అదే తీర్పు వెలువడింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. దీనితో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవ్వాళ సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం వాదనలను ఆలకించింది. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపించారు.
ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి కావడం వల్ల పరువునష్టం కేసులో రాహుల్ గాంధీపై గరిష్ఠస్థాయి శిక్షను విధించడం సరికాదని మను సింఘ్వీ స్పష్టం చేశారు. ఆయన వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. శిక్షను ఖరారు చేసే సమయంలో దీనికి సూరత్ న్యాయస్థానం సరైన, సంతృప్తికరమైన వివరణలను ఇవ్వలేకపోయిందని తెలిపింది.

ఈ తీర్పుతో రాహుల్ గాంధీ మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టడం దాదాపుగా ఖాయమైనట్టే. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఆయన సభలో ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. అత్యంత సంతోషకరమైన రోజుగా అభివర్ణించింది.
ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించడం.. కాంగ్రెస్‌కు బూస్ట్ ఇచ్చినట్టయింది. ఈ తీర్మానంపై చర్చ సమయంలో కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యవహరించగలదనే అభిప్రాయాలు ఉన్నాయి.
కాగా- సుప్రీంకోర్టు ఊరట ఇచ్చినప్పటికీ.. రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటుపై స్పీకర్ ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఈ మధ్యంతర ఉత్తర్వులను స్పీకర్ గౌరవిస్తారా? లేక.. తన విచక్షణాధికారాలను ప్రయోగించి.. అనర్హత వేటుపై నిర్ణయాన్ని పెండిగ్‌లో పెడతారా? అనేది చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications