‘దేశం గర్వపడాలి’: చిన్నారి వైశాలికి మోడీ రాసిన లేఖ
ముంబై: మహారాష్ట్ర పుణెలోని రాయ్‌గడ్ కాలనీలో ఒక చిన్న గదిలో తన తండ్రి, మేనమామ, అమ్మమ్మతో కలిసి నివసిస్తున్న చిన్నారి వైశాలి యాదవ్.. గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండేది. అయితే, తన బాధను వెల్లడిస్తూ వైశాలి రాసిన లేఖకు స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆ చిన్నారికి గత వారం హార్ట్ సర్జరీ చేయించింది.
ఆ సర్జరీ సక్సెస్ అవడంతో చిన్నారి కుటుంబం ఆనందంగా ఉంది. అయితే, తనకు సర్జరీ చేయించమని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి తన మొదటి లేఖలో కోరిన వైశాలి.. హార్ట్ సర్జరీ విజయవంతమైన తర్వాత కృతజ్ఞతలు తెలుపుతూ మోడీకి మరో లేఖ రాసింది. ఇదంతా బాగానే ఉంది.

ఆ తర్వాత జరిగిన మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వైశాలికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా లేఖ రాయడం. దీంతో, వైశాలి, ఆమె కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రధాని మోడీయే స్వయంగా రాసిన ఈ లేఖలో ఆయన సంతకం కూడా ఉండటంతో వారు మరింత ఆనందం పొందారు.
మోడీ రాసిన ఈ లేఖను సోమవారం సాయంత్రం వైశాలి, మేనమామ ప్రతాప్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చిన్న ఇంట్లో నివసిస్తున్న తమ వంటి వారికి ఒక ప్రధాని లేఖ రాస్తారని ఎవరైనా ఊహించగలరా?. మా ఇంటి అడ్రసు తెలుసుకునేందుకు పోస్ట్ మ్యాన్ కూడా కష్ట పడాల్సి వచ్చింది. ఎన్వలప్‌పై పీఎంసీల్ ఉండటంతో సరైన సమయానికి ఆ లేఖ మాకు చేరింది' అని అన్నారు.
మోమై తనకు లేఖ రాస్తారనే నమ్మకం తనకు ఉందని చిన్నారి వైశాలి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. వైషాలికి ఎంతో ప్రాణప్రదమైన ఆమె గ్రాండ్ మదర్ కూడా ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది. కాగా, ఆ లేఖలో.. దేశం గర్వించే విధంగా ఎదగాలని వైశాలిని ఆశీర్వదించారు ప్రధాని నరేంద్ర మోడీ.












Click it and Unblock the Notifications