ఉడుము రక్తాన్ని తాగుతోన్న తమిళ తంబిలు.. (వీడియో)
చెన్నై : 'ఉడుము రక్తం తాగడం ద్వారా కండరాలు పటిష్టమవుతాయి.." ఇందులో శాస్త్రీయత ఎంతుందో తెలియదు గానీ.. తమిళనాడులో మాత్రం ఉడుము రక్తాన్ని గ్లాసుల లెక్కన గొంతులో పోసేసుకుంటున్నారు అక్కడి జనం. ఉడుము మెడ భాగంలో కాటు పెట్టి.. దాన్నుంచి రక్తాన్ని గ్లాసుల్లో సేకరించి.. పంపిణీ చేస్తున్నారు. మరింత ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. ఒక్క గ్లాసు ఉడుము రక్తానికి గాను దాదాపు రూ.5వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ఉడుము రక్తం శారీరక పుష్టిని కలగజేస్తుందన్న నమ్మకంతో.. తమిళనాడులోని పలువురు గిరిజనలు యథేచ్చగా ఉడుముల సంహారానికి పూనుకున్నారు. వాటిని కోసి.. రక్తం పిండి.. పలువురికి పంపిణీ చేస్తున్నారు. గ్లాసుల నిండా ఉడుము రక్తాన్ని కొందరు వ్యక్తులు గుటుక్కుమనిపిస్తోన్న దృశ్యాలు.. ఇంటర్నెట్ లోకి ఎక్కడంతో.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.
అయితే ఈ వ్యవహారంపై అటవీశాఖ అధికారులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రక్తం కోసం చంపడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద తీవ్రమైన నేరమని, ఉడుము సరీసృపాల రక్షిత జంతువు అని చెన్నై వన్యప్రాణి వార్డెన్ కె గీతాంజలి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, పాలవంతంగల్ అనే ప్రాంతంలో ఈ వ్యవహారం చోటు చేసుకుంటున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంచీపురం పరిధిలోని అటవీప్రాంతానికి చెందిన కొంతమంది గిరిజనులే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అక్కడి అటవీశాఖాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవడానికి సిద్దమయ్యారు అధికారులు.












Click it and Unblock the Notifications