చాపకింద నీరులా విస్తరణ: హడలెత్తిస్తోన్న వైరస్
న్యూఢిల్లీ: ప్రమాదకరమైన మంకీపాక్స్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరించడం మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ముగ్గురు ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒకరు కోలుకున్నారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్నారు. ఇంకొకరు మరణించారు. ఆ తరువాత ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లల్లో మంకీపాక్స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రెండో కేసు..
దేశ రాజధానిలో మరొకరు ఈ వైరస్ బారిన పడ్డారు. ఢిల్లీలో నమోదైన రెండో పారిజిటివ్ కేసు ఇది. ఓ నైజీరియన్‌లో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. నాలుగైదు రోజులుగా జ్వరం, దగ్గు, శరీరంపై దద్దుర్లతో బాధపడుతున్న అతనికి వైద్య పరీక్షలను నిర్వహించారు. నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అతనికి మంకీపాక్స్ సోకినట్లు రిపోర్ట్ అందింది. దీనితో అతణ్ని లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో అడ్మిట్ చేశారు.

నో ట్రావెల్ హిస్టరీ..
అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఈ మధ్యకాలంలో ఏ బయటికి దేశానికీ ప్రయాణించలేదు. అయినప్పటికీ- మంకీపాక్స్ సోకడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రమంగా మంకీపాక్స్ సామాజిక విస్తరణ కింద మారొచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. సాధారణంగా విదేశాల నుంచి వచ్చిన వారికే ఇప్పటివరకు మంకీపాక్స్ సోకింది. కేరళకు చెందిన ముగ్గురు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన వారే.

ఆరుకు చేరిన పాజిటివ్స్..
కాగా- తాజాగా నమోదైన పాజిటివ్‌తో ఇప్పటివరకు దేశంలో నమోదైన మంకీపాక్స్ కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో ఇద్దరు ఆఫ్రికన్ దేశస్తులు కూడా ప్రస్తుతం మంకీపాక్స్ లక్షణాలతో అడ్మిట్ అయ్యారు. వారికి నమూనాలకు సంబంధించిన నివేదికలు ఇంకా అందాల్సి ఉంది. వారిని కూడా ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తోన్నారు.

ఢిల్లీలో ఇదివరకే..
ఇదివరకు ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో నివసించే ఆ 31 సంవత్సరాల వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డాడు. అతనికీ ట్రావెల్ హిస్టరీ లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో నిర్వహించిన ఓ బ్యాచిలర్ పార్టీకి హాజరయ్యాడు. ఆ తరువాతే మంకీపాక్స్ లక్షణాలతో మౌలానా ఆజాద్ ఆసుపత్రిలో చేరాడు. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. ప్రత్యేకించి- విమాన ప్రయాణికులపై ఆంక్షలను విధించింది.












Click it and Unblock the Notifications