Monsoon: బంగాళాఖాతంలో కొత్త అలజడి: వర్షాల్లేని రాష్ట్రాలకు గుడ్ న్యూస్!
ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు వర్షాలు లేక అల్లాడుతున్నాయి. రుతుపవనాలు (Monsoon ) కనిపించీ కనిపించనట్లుగా కనిపించి మాయమవుతున్నాయి. దీంతో ఎప్పుడు వర్షం కురుస్తుందో, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియని పరిస్ధితులు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం నుంచి తాజాగా మరో గుడ్ న్యూస్ అందింది. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు దేశంలో వర్షాలు లేక అల్లాడుతున్న రాష్ట్రాలకు ఊరటనిచ్చే సంకేతాలను ఇస్తున్నాయి.
తాజాగా వెలువడిన అంతరిక్ష ఉపగ్రహ చిత్రాల సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో వేగంగా ఒక కొత్త రుతుపవన వాతావరణ వ్యవస్థ బలపడుతోందని తెలిసింది. రాబోయే వారం నుంచి పది రోజుల కాలం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల గమనానికి, చివరి అంచనాలను సానుకూలంగా శాసించడానికి అత్యంత కీలకంగా మారనుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మార్పుల వల్ల తూర్పు, మధ్య భారతదేశ పరిధిలోని అనేక రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురిసే అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బంగాళాఖాతం నుండి పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం వరకు సుదీర్ఘమైన ఉపరితల మేఘాల ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో రానున్న ఐదు నుంచి ఏడు రోజులలో వరుసగా కొన్ని అల్పపీడన ద్రోణులు ఏర్పడి, అవి పశ్చిమ దిశగా పయనిస్తూ దేశంలోని లోతట్టు ప్రాంతాలకు కావాల్సిన వర్షాలను చేరవేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

కొద్ది నెలలుగా కొన్ని ఉత్తరాది ప్రాంతాలలో అతివృష్టి నెలకొనగా, తూర్పు, ఈశాన్య భారతంలోని పలు రాష్ట్రాలలో తీవ్రమైన వర్షపాత లేమి కొనసాగుతోంది. తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, బిహార్, మేఘాలయ, మణిపూర్ వంటి రాష్ట్రాలలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ సాధారణం కంటే దాదాపు 40 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. మరోవైపు లడఖ్, దాద్రా నగర్ హవేలీలో, ఒడిశా, ఢిల్లీలో ఎక్కువ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణంగా నమోదు కావాల్సిన 679.5 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను కేవలం 587.8 మిల్లీమీటర్లు మాత్రమే రికార్డైంది. ఇది జాతీయ స్థాయిలో సుమారు 13 శాతం మేర వర్షపాత లోటును స్పష్టంగా చూపిస్తోంది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి పక్షంలో కురిసే వర్షాలే దేశవ్యాప్తంగా ఏర్పడిన ఈ లోటును భర్తీ చేయడానికి అత్యంత కీలకం కానున్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇలాంటి తరుణంలో బంగాళాఖాతంలో కదులుతున్న ఈ కొత్త వ్యవస్థలు సమర్థవంతంగా వర్షాలు కురిపిస్తే, ఈ ఏడాది రుతుపవనాల ముగింపు ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో జలాశయాలలో నీటి నిల్వలను పెరగడం, వ్యవసాయ పనులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని చెప్తున్నారు.














Click it and Unblock the Notifications