తృణమూల్ లో ఫస్ట్ వికెట్ డౌన్..!!
పశ్చిమ బెంగాల్ లో అధికార మార్పిడి అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి వరుస షాకులను ఇస్తోందక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయక్కడ. వ్యతిరేకంగా ప్రచారం చేసిన సెలెబ్రెటీలను కూడా వదలట్లేదు. కేసులు నమోదవుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య తాజాగా తృణమూల్ కు మరో షాక్ తగిలింది. బరాసత్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నాయకురాలు, లోక్ సభ సభ్యురాలు కకోలి ఘోష్ దస్తిదార్ రాజీనామా చేశారు. శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ అంతర్గత కలహాలతో సతమతం అవుతోంది. పార్టీలో కార్యకర్తలు, మద్దతుదారులు ఒక్కొక్కరుగా తప్పుకొంటోన్నారు. నాయకులు సైతం బహిరంగంగా విమర్శలు మొదలుపెట్టారు.

అదే సమయంలో కకోలీ ఘోష్ దస్తిదార్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్గత కలహాలు ఏ స్థాయిలో చెలరేగుతున్నాయోననడానికి అద్దం పట్టింది. బరాసత్ జిల్లాలో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తోన్నట్లు ప్రకటించారామె. ఐప్యాక్ పాత్రపై ఆమె బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పార్టీ అధినేత్రి మమత బెనర్జీ పట్ల కూడా పరోక్షంగా సూచనాత్మక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తన రాజీనామా లేఖను తృణమూల్ అధ్యక్షుడు సుబ్రతా బక్షికి పంపారు. బరాసత్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తోన్నానని, జిల్లాలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఓటమికి ప్రధాన కారణం ఐప్యాక్ వ్యూహాలేనని ఆరోపించారు. తనలాంటి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను కూడా ఐప్యాక్ ప్రతినిధులు కించపరిచే విధంగా వ్యవహరించారని కకోలీ ఆరోపించారు. కొన్ని నెలలుగా ఈ వ్యవహార శైలి వల్ల మానసిక వేదన అనుభవించానని వెల్లడించారు.
ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆమె ఐప్యాక్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. ఎక్కడో పుట్టుకొచ్చిన ఓ సంస్థ హఠాత్తుగా రాజకీయాలను శాసించడం మొదలు పెట్టిందని విమర్శించారు. తాను 40-42 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్ననని, ఆ సంస్థకు చెందిన ఓ 22 ఏళ్ల అమ్మాయి వచ్చి తనను బెదిరిస్తూ మాట్లాడటం షాక్ కు గురిచేసిందని అన్నారు. రాజకీయం ఎలా చేయాలి, ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలి అంటూ తనకే పాఠాలు చెబుతున్నారని తేల్చి చెప్పారు. పార్టీ సర్వనాశనం కావడానికి ఆ సంస్థే కారణమని మండిపడ్డారు.
ఎన్నికల అనంతరం మమతా బెనర్జీని కలిశారా అని ప్రశ్నించగా ఆమె బిజీగా ఉన్నారని కకోలీ బదులిచ్చారు. దీంతో మమత-కకోలీల మధ్య దూరం పెరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని రోజుల క్రితమే లోక్‌సభ చీఫ్ విప్ పదవి నుండి కకోలీని తొలగించారు మమత బెనర్జీ. ఆమె స్థానంలో కల్యాణ్ బెనర్జీని పునర్నియమించారు. ఆ సమయంలో కకోలీ బహిరంగంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కకోలీకి కేంద్ర భద్రత లభించడం టీఎంసీ వర్గాలలో చర్చకు దారి తీసింది.












Click it and Unblock the Notifications