భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత: ప్రధాని మోడీ విచారం
చెన్నై:భారత హరిత విప్లవ పితామహుడు ప్రముఖ వ్యవసాయ శాష్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వివరాలను ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. స్వామినాథన్ మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
స్వామినాథన్ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకే సాంబశివన్ సర్జన్. కాగా, మెట్రిక్యూలేషన్ పూర్తి చేసిన తర్వాత స్వామినాథన్ కూడా తండ్రి బాటలోనే మెడికల్ స్కూల్లో చేరారు. అయితే, 1943లో బెంగాల్‌లో చోటు చేసుకున్న క్షామాన్ని చూసిన స్వామినాథన్.. తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అుడగులు వేశారు. త్రివేండ్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు.

ఆ తర్వాత మద్రాసు అగ్రికల్చరల్ కాలేజీలో చేరారు. అగ్రికల్చరల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. అనంతరం ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(IARI)లో పీజీ చేశారు. ఆ తర్వాత స్వామినాథన్ యూపీఎస్సీ పరీక్ష రాసి ఐపీఎస్‌కు అర్హత సాధించారు. కానీ, ఆ అవకాశాన్ని వదులుకుని యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరారు. అక్కడే బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు.
అక్కడ్నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో చేరి పీహెచ్‌డీ పూర్తి చేశారు. కొంతకాలం అక్కడ పనిచేసిన స్వామినాథన్.. 1954లో భారత్‌కు తిరిగొచ్చి ఐఏఆర్ఐలో శాస్త్రవేత్తగా రీసెర్చ్ కొనసాగించారు. 1972-79 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్‌ను వ్యవసాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.
Deeply saddened by the demise of Dr. MS Swaminathan Ji. At a very critical period in our nation’s history, his groundbreaking work in agriculture transformed the lives of millions and ensured food security for our nation. pic.twitter.com/BjLxHtAjC4
— Narendra Modi (@narendramodi) September 28, 2023
ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో వరి వంగడాలు సృష్టించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామన్ మెగసెసె లాంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు స్వామినాథన్.
కాగా, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మన దేశ చరిత్రలో చాలా క్లిష్టమైన సమయంలో, వ్యవసాయంలో ఆయన చేసిన అద్భుతమైన పని లక్షలాది మంది జీవితాలను మార్చింది, మన దేశానికి ఆహార భద్రతకు భరోసా ఇచ్చిందని కొనియాడారు.
వ్యవసాయానికి ఆయన చేసిన విప్లవాత్మక సహకారాలకు అతీతంగా, డాక్టర్ స్వామినాథన్ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా, అనేకమందికి పోషకాహార మార్గదర్శకుడిగా ఉన్నారు. పరిశోధన, మార్గదర్శకత్వం పట్ల అతని తిరుగులేని నిబద్ధత అసంఖ్యాక శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలపై చెరగని ముద్ర వేసిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
డాక్టర్ స్వామినాథన్‌తో నా సంభాషణలను నేను ఎప్పుడూ ఆదరిస్తాను. భారతదేశం పురోగతిని చూడాలనే ఆయన అభిరుచి ఆదర్శప్రాయమైనది. ఆయన జీవితం, పని రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు ప్రధాని మోడీ.












Click it and Unblock the Notifications