వరుస పెళ్లిళ్ల కిలాడి లేడీ అరెస్ట్, సీక్రెట్‌గా వివరాలు సేకరించి షాకయ్యాడు
చెన్నై: వరుస పెళ్లిళ్లు చేసుకొని యువకులను మోసం చేస్తున్న ఓ 37 ఏళ్ల మహిళను గురువారం నాడు చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆమె దాదాపు పది పెళ్లిళ్ల వరకు చేసుకునేందుకు సిద్ధమైనట్లుగా గుర్తించారని సమాచారం. ఆన్ లైన్ ద్వారా ఆమె యువతతో పరిచయం ఏర్పరుచుకొని, వివాహం చేసుకుంది. మహిళను కేవీ సింధుగా గుర్తించారు.
ఆమె ముఖ్యంగా బిజినెస్‌మెన్‌ను లక్ష్యంగా చేసుకుందని గుర్తించారు. శ్రీనివాసన్ అనే బిల్డింగ్ కాంట్రాక్టర్ ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇతను మొగపేర్ ఈస్ట్ టీవీఎస్ అవెన్యూకి చెందిన వ్యక్తి. ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకున్న ఆమె అయిదో పెళ్లికి సిద్ధమైంది.
శ్రీనివాసన్ వధువు కోసం అన్వేషిస్తుంటే.. గత ఏడాది చివర్లో ఓ వెబ్‌సైట్‌లో పెళ్లి ప్రకటన ఉన్న వివరాల మేరకు కోయంబత్తూరుకు చెందిన యువతికి ఫోన్ చేశాడు. తాను బీఎస్సీ చదువుకున్నట్టు, తన ఇష్టాయిష్టాలను ఆమె చెప్పింది. శ్రీనివాసన్‌కు నచ్చింది.

దీంతో ఇటీవలె ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నెల రోజుల తర్వాత ఆమెలో మార్పు వచ్చింది. దీంతో రహస్యంగా ఆమె ఫోన్లోని నెంబర్లు సేకరించాడు. కొన్ని నెంబర్ల ద్వారా లభించిన సమాచారంతో షాకయ్యాడు. తన వద్ద ఉన్న వివరాలు, సమాచారం పోలీసులకు అందించాడు.
మహిళా పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు. దీంతో మాయలేడీ ఉదంతం బయటకు వచ్చింది. కేవలం డబ్బు, ఆభరణాల మీద మోజుతో భర్తలను మార్చేసినట్లు ఆమె విచారణలో తెలిపింది. 2010లో టీ నగర్‌కు చెందిన నరసింహా రావును పెళ్లి చేసుకొని, అక్కడి నుండి ఉడాయించింది.
2012లో, 2013లో ఇలా మొత్తం నలుగురిని పెళ్లి చేసుకుంది. శ్రీనివాసన్ ఫిర్యాదుతో ఆమె ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన వాక్చాతుర్యంతో మాటల మత్తులో పడేసి ఆమె యువకులను తన బుట్టలో పడేసుకుంటుంది. వివాహం కోసం తరుచూ తన పేర్లను మార్చుకుంటున్నట్లు ఆమె విచారణలో తెలిపింది. పోలీసులు ఆమె పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications