ఇంజనీరింగ్ అద్భుతం... ఇండియా ఫస్ట్ బుల్లెట్ రైలు
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ భారతీయ రైల్వేకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. గంటలకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. మార్గమధ్యంలో నదులపై 24 వంతెనలపై రెండు గంటల్లో 508 కిలోమీటర్ల ప్రయాణం పూర్తికానుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ ప్రభుత్వం కలలను కనడంలేదని, వాస్తవాలను సృష్టిస్తోందని, ప్రధానమంత్రి మోడీ మూడో పాలనలో బుల్లెట్ రైలు కోసం ఎదురుచూడండని పోస్ట్ చేశారు.
ఈ ప్రాజెక్టు ప్రపంచస్థాయి ఇంజనీరింగ్ లో ఓ అద్భుతం అని మంత్రి అభివర్ణించారు. దేశంలోనే మొదటిసారిగా స్లాబ్ ట్రాక్ వ్యవస్థ, భూకంపాలను ముందుగానే గుర్తించే ఏర్పాట్లు, ఏడు సొరంగాలు, సముద్రగర్భంలో ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్, 28 స్టీలు వంతెనలు, అత్యాధునిక సౌకర్యాలతో 12 రైల్వేస్టేషన్లు రూపుదిద్దుకుంటున్నాయి. దాదాపు రూ.1.08 లక్షల కోట్ల వ్యయం కానుంది. 2026లో పట్టాలెక్కనుంది.

2021 నవంబరులో ఈ బుల్లెట్ రైలు పనులు ప్రారంభమయ్యాయి. గుజరాత్‌లోని బిలిమోరా, సూరత్ మధ్య 50 కిలోమీటర్ల లైను 2026 ఆగస్టులో పూర్తికానుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రోజుకు 35 బుల్లెట్ రైళ్లు 70 ట్రిప్స్ వేయనున్నాయి. 2050 నాటికి వీటి సంఖ్యను 105కు పెంచనున్నారు. సంవత్సరానికి 1 కోటి 60 లక్షల మంది ప్రయాణిస్తారని రైల్వే అంచనా వేసింది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం రూ.10వేల కోట్లు, గుజరాత్, మహారాష్ట్ర చెరో రూ.5వేల కోట్లు అందజేస్తున్నాయి. మిగిలిన నిధులను జపాన్ నుంచి 0.1 వడ్డీరేటుతో రుణంగా పొందారు. సాంకేతిక సహకారం కూడా జపానే అందజేస్తోంది.












Click it and Unblock the Notifications