అమితాబ్ బంగ్లా, మేయర్ ఆఫీసుకు బాంబు బెదిరింపు.. ముంబైలో హై అలర్ట్!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం రేపింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంతో పాటు ముంబై మేయర్ కార్యాలయం, పలు బ్యాంకులు, కోర్టులను బాంబులతో పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్‌తో భద్రతా సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈమెయిల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, మహాలక్ష్మి రేస్ కోర్స్ పేర్లను కూడా ప్రస్తావించారు.
రంగంలోకి బాంబ్ స్క్వాడ్.. ముమ్మర తనిఖీలు
బెదిరింపు ఈమెయిల్‌పై సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముందు జాగ్రత్త చర్యగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది మేయర్ కార్యాలయంతో పాటు బీఎంసీ ప్రధాన కార్యాలయంలోని అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే ఈమెయిల్లో పేర్కొన్న అమితాబ్ బచ్చన్ బంగ్లా, విమానాశ్రయం, ఇతర ముఖ్య ప్రాంతాల్లోనూ భద్రతను పెంచి సోదాలు నిర్వహించారు. గంటల తరబడి సాగిన ఈ తనిఖీల్లో ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ లభించకపోవడంతో పోలీసు అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఖలిస్తాన్ అనుకూల ప్రస్తావన.. సైబర్ సెల్ దర్యాప్తు
సదరు బెదిరింపు ఈమెయిల్లో ఖలిస్తాన్ అనుకూల అంశాలు, రెచ్చగొట్టే సందేశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేవలం ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఉద్దేశంతోనే ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఎవరున్నారనే కోణంలో ముంబై పోలీసులు, సైబర్ సెల్ బృందాలు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.














Click it and Unblock the Notifications
