అమితాబ్ బచ్చన్ మెచ్చిన ఆఫీసర్.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది!
మధ్యప్రదేశ్‌లో ఒకప్పుడు టెలివిజన్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)' ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహిళా తహశీల్దార్ ఇప్పుడు భారీ అవినీతి కుంభకోణంలో అరెస్ట్ కావడం సంచలనం సృష్టిస్తోంది. వరద సహాయక నిధుల్లో జరిగిన రూ.2.5 కోట్ల గోల్‌మాల్‌కు సంబంధించి ఆమెను బరోడా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 2021లో బరోడా తహసీల్ పరిధిలో జరిగిన వరద సహాయక నిధుల పంపిణీలు అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. గ్వాలియర్‌లోని ఆమెను నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని.. కోర్టులో హాజరుపరిచిన అనంతరం శివపురి జైలుకు తరలించారు.
వరద సహాయక నిధుల కుంభకోణం
2021లో మధ్యప్రదేశ్‌లో సంభవించిన వరదల సమయంలో బాధితులకు అందజేయాల్సిన సహాయక నిధులను తప్పుడు బ్యాంక్ ఖాతాలకు మళ్లించి భారీ ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 22 మంది రెవెన్యూ అధికారులు, మరో తహశీల్దార్‌తో సహా పలువురిని అరెస్ట్ చేశారు. మొత్తం 110 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఆమె అప్పీళ్లను తిరస్కరించిన న్యాయస్థానాలు
అమితా సింగ్ తోమర్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఆమె అప్పీళ్లను కోర్టులు తిరస్కరించాయి. అప్పటి నుంచి ఆమె విధులకు గైర్హాజరవుతూ అజ్ఞాతంలో ఉన్నారు. విజయపూర్ తహశీల్దార్‌గా ఉన్న ఆమెను బుధవారం కలెక్టర్ అర్పిత్ వర్మ విధుల్లో నుంచి తొలగించారు. అనంతరం పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టి గ్వాలియర్‌లో అరెస్ట్ చేశారు.
కేబీసీ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు
అమితా సింగ్ తోమర్ గతంలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)' షోలో పాల్గొని రూ.50 లక్షలు గెలుచుకున్నారు. ఆ సమయంలో ఓ ప్రభుత్వ అధికారిణిగా ఆమె చూపిన ప్రతిభకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. అటువంటి ఆఫీసర్ ఇప్పుడు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులో జైలు పాలవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications