
మునుగోడు: మద్యం, డబ్బు ఏరులై పారుతోన్న ఈ నియోజకవర్గంలో... ఏళ్లుగా నీళ్లు రావడం లేదెందుకు?

ఇప్పుడు అందరూ మునుగోడు గురించే మాట్లాడుకుంటున్నారు. మునుగోడులో ఉన్న వాళ్లు కూడా పార్టీల ప్రచార హోరు గురించే మాట్లాడుకుంటున్నారు. అలా కాసేపు మాట్లాడుకున్న తరువాత, ఆ చర్చలన్నీ ఒకేలా ముగుస్తున్నాయి.
ఒకేలా ముగుస్తున్నాయి అంటే.. ఏ పార్టీ గెలుస్తుందో అన్న తీర్పుతో కాదు.. ఎవరొచ్చినా మా మునుగోడుకు నీళ్లెప్పుడొస్తాయో అనే చర్చతోనే ముగుస్తున్నాయి.
ఈ నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం గ్రామం నుంచి అలా పల్లెలవైపు వెళుతుంటే బీబీసీ బృందానికి కనిపించారు బుగ్గయ్య అనే రైతు. ఈయనకు అయిదు ఎకరాల పొలం ఉంది. మునుగోడులో ఎన్నో ఎన్నికలు చూశారు. అక్కడి వ్యవసాయం గురించి మాట్లాడారు.
''ఇక్కడ అన్నీ బోర్లే.. పారే నీరు (కాలువలు) లేదు.'' అంటూ అక్కడి సాగు విధానం చెప్పారు.
కాలువలు ఎందుకు? బోర్లతో పంటలు ఇక్కడ బాగానే పండుతున్నాయి కదా? అని ప్రశ్నించాను.
''బోర్లతో నాలుగు పుట్లు ధాన్యం కూడా సరిగా పండదు. అదే కాలువ అయితే పది పుట్లు వస్తుంది'' అని సమాధానం చెప్పారు బుగ్గయ్య.

పుట్లు అంటే క్వింటాళ్లు, టన్నులు లాగా అదో కొలమానం. పూర్వం వాడేవారు. పుట్టి అంటే బహుశా 220 లేదా 360 కేజీల కొలమానం అని గుర్తు. నాకూ స్పష్టంగా తెలియదు. ఆ పుట్ల లెక్క నాకు తెలియకపోవచ్చు కానీ సరైన నీటి వసతి లేక పంటల దిగుబడి సగమే ఉంటోందని ఆ రైతు ఆవేదన అర్థం అయింది.
''ఇక్కడ నేలలు చాలా మంచివి. కానీ నీటి వసతే లేదు'' మోటారు పెట్టాలంటే బోలెడు ఖర్చు. పెట్టాక రిపేరు వస్తే, ఆ ఏడాది పంట బాగా పండి, రేటు బాగా వచ్చినా సరే, మొత్తం డబ్బులు అన్నీ మోటారు రిపేరుకే పోతాయి'' అన్నారు బుగ్గయ్య.
పోనీ ఆ బోర్లు అయినా బాగా నీరు ఇస్తాయా అంటే అదీ లేదు.. ''వానలు కురిస్తేనే బోర్లలోకి నీరు వస్తుంది. రెండు మూడేళ్లుగా వానలు బాగున్నాయి కాబట్టి ప్రస్తుతం పర్లేదు. కానీ ఒక్క ఏడాది వానలు సరిగా పడకపోయినా, భూమిలో నీళ్లు తగ్గిపోయి, బోర్లు పనిచేయడం మానేస్తాయి. గతంలో ఎన్నో కరువులు చూశాం. వాన రాకపోతే నరకమే మాకు. వానల మీదే మా బతుకు'' అన్నారు బుగ్గయ్య.
అక్కడ నుంచి దాదాపు గంట ప్రయాణం తరువాత మర్రిగూడ వచ్చింది. అక్కడ మలిగిరెడ్డి అనంత రెడ్డి అనే ఒక మాజీ రైతును కలిశాం. ఆయన మాజీ రైతు అనడానికి కారణం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని బాగా ఫాలో అయిన వారికి కొందరికి ఆయన పేరు కూడా తెలిసే అవకాశం ఉంది.
- ఎన్నికల్లో ఓట్లు చీల్చటానికి.. కీలక గుర్తులను పోలిన గుర్తులతో డమ్మీ అభ్యర్థులను పోటీకి పెడుతున్నారా?
- వైసీపీ పేరు మార్చడం సాధ్యమవుతుందా, గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?

తెలంగాణ రాకముందు నల్గొండ జిల్లా నీటి సమస్యకి ప్రతిరూపంగా అనంత రెడ్డిని చూపించేవారు ఉద్యమకారులు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడకు చెందిన ఈయన తనకున్న 15 ఎకరాల భూమి కోసం 120 పైగా బోర్లు వేశారు. తన తోటను కాపాడుకోవడానికి 1985 నుంచి 2005 వరకూ బోర్లు వేసి వేసి విసిగి చివరకు 2006 లో తన భూమిని అమ్మి, అప్పులు తీర్చారు.
''బత్తాయి తోట పెట్టాను. తోటను కాపాడుకోవడానికి నా పొలంలోనూ, తెలిసిన వారి పొలాల్లోనూ కలిపి 120కిపైగా బోర్లు వేశాను. అప్పులు తీర్చలేక పొలం అమ్మేశాను. పొలం అమ్మేశాక మనశ్శాంతి దక్కింది. సాగు చేసినన్నాళ్లూ ఒకటే టెన్షన్. ఎప్పుడు ఏ మోటార్ ఆగిపోతుందో.. ఎప్పుడు ఏ బోరు లో నీళ్లు తగ్గిపోతాయో లేదా ఆగిపోతాయో అనే భయమే వేధించేది.''
అప్పట్లో తాను వేసిన బోర్లలో ఒకదాన్ని తన గ్రామస్తుల తాగునీటి కోసం వదిలేశారు అనంతరెడ్డి.
బుగ్గయ్య, అనంత రెడ్డి వంటి వారు మునుగోడులో చాలా మందే కనిపిస్తారు. మునుగోడు నియోజకవర్గం స్థిరమైన నీటి వసతి లేని ప్రాంతం. కనీసం ఒక చిన్న ప్రాజెక్టు కానీ, కాలువ కానీ ప్రస్తుతం ఇక్కడ లేవు. ఇక్కడ ప్రజలు ఎప్పటినుంచో నది నీటి కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే, బోర్లతో చేసే వ్యవసాయం వల్ల నష్టం తప్ప లాభం ఉండదని రైతుల ఆవేదన. అది కూడా వానలు సరిగా కురిసి, భూగర్భ జలాలు పెరిగితేనే ఇక్కడ బోర్లలో నీళ్లు వచ్చేది. లేదంటే పంట ఎండాల్సిందే. ఈ నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామాల్లో పదుల సంఖ్యలో బోర్లు వేసి అప్పుల పాలైన రైతులు వందల సంఖ్యలో కనిపిస్తారు. బోర్ల ఖర్చు భరించలేక హైదరాబాద్‌లో కూలీలుగా మారారు ఎందరో రైతులు.
- పవన్ కల్యాణ్; 'ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా'- 'ఒక్కసారి కాదు వందసార్లు అంటా' -వైసీపీ మంత్రి అంబటి రాంబాబు
- ఏపీ ప్రభుత్వం-బైజూస్ ఒప్పందం: విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌తో బడికి వెళ్ళాలని ఆదేశాలు... ఇంకా రాబోయే మార్పులేంటి?

ఈ ప్రాంతానికి స్థిరమైన సాగునీరు ఇవ్వాల్సిన చెర్లగూడెం,కృష్ణరాయునిపల్లె రిజర్వాయర్లు, వాటిల్లోకి నీరు ఇవ్వాల్సిన ప్రాజెక్టులూ ఇంకా పూర్తి కాలేదు. పాలమూరు ఎత్తిపోతల నీటి తరలింపును అక్కడి వారు అడ్డుకున్నారు. ఎస్సెల్బీసీ నుంచి కాకుండా దిండి లిఫ్టు నుంచి నీరు ఇస్తామన్నారు. కానీ అది కూడా ఇంకా పూర్తికాలేదు. దిండి హీడ్ వర్క్స్, 500 మీటర్ల టన్నెల్ పూర్తి చేయడానికి రెండు వేల కోట్లు కావాలి. తెలంగాణ వచ్చిన కొత్తల్లోనే శంకుస్థాపన జరిగినప్పటికీ, ఇప్పటికీ అవి పూర్తి కాలేదు. అసలు చెర్లగూడెం, కృష్ణరాయునిపల్లె రిజర్వాయర్ల నిర్వాసితుల సమస్య కూడా ఇంకా పరిష్కారం కాలేదు.
చెర్లగూడెం రిజర్వాయర్ దగ్గర బీబీసీ బృందం సందర్శించినప్పుడు అక్కడ మట్టి కట్ట పని జరుగుతోంది. కాలువలు కూడా కొన్ని పూర్తయ్యాయి. మరోవైపు నియోజకవర్గంలోనే నిర్వాసితుల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.
మునుగోడుకు నీరివ్వాల్సిన ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి కొందరు కొన్ని ప్రత్యామ్నాయాలు సూచిస్తున్నారు. ''గోదావరి నీటిని ఇక్కడకు మళ్లించవచ్చు. అలాగే స్థానిక చిన్న వాగులనూ ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదు'' అని బీబీసీతో చెప్పారు ఒక రిటైర్డ్ ఇంజినీర్.
- తెలుగు నేల మీద ఉన్న ఈ దీవులను చూస్తే విదేశీ యాత్రకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది
- దగ్గు మందు మరణాలు: భారత్‌లో తయారవుతున్న ఔషధాలు సురక్షితమైనవి కావా?

''కేసీఆర్ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరంతో పోలిస్తే ఇక్కడ ప్రాజెక్టుకు పెట్టే ఖర్చు చాలా తక్కువ. ఇక్కడ జనాల ఘోష ఎప్పటిదో… రాజశేఖర రెడ్డి శ్రీశైలం నుంచి నీళ్లు తెస్తానని ప్రతిపాదించారు. తరువాత తెలంగాణ వచ్చాక దాన్ని దిండి లిఫ్టుగా మార్చారు. మధ్యలో పాలమూరు ఎత్తిపోతల అన్నారు. మహబూబ్ నగర్ వాళ్లు అభ్యంతరం చెప్పడంతో అది ఆగింది. దిండి ఎప్పుడు పూర్తవుతుందో, మాకు ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలియదు'' అని బీబీసీతో చెప్పారు కిసాన్ కాంగ్రెస్ నాయకులు సతీశ్.
''ఇక్కడ రైతులు పొలాల్లో విత్తనాలు రెండు మూడుసార్లు నాటాల్సి వస్తుంది. నీటి సమస్య వల్ల విత్తనాలు నాటడం ఆలస్యం అయితే సకాలంలో పంట రాదు. దానివల్ల పంట నష్టపోవాలి. ఇదో నిరంతర ప్రక్రియ అయిపోంది ఇక్కడ.''
ఈ సమస్యపై ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో బీబీసీ మాట్లాడింది.
- దళిత విద్యార్థినిని టీచర్ క్లాసులో బట్టలు విప్పించారా, ఆ బాలిక కిరోసిన్ పోసుకుని ఎందుకు నిప్పంటించుకుంది?
- ఆకలిలో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కంటే భారత్ ఎలా దిగజారింది, కేంద్రం స్పందనేంటి

''ఆ ప్రాజెక్టు ఎప్పుడో అయిపోవాల్సింది. రాజగోపాల రెడ్డి నిర్వాసితులను రెచ్చగొట్టి ఎక్కువ డబ్బు కోసం ఆందోళన చేయించడం వల్లే ఆలస్యం అయింది'' అన్నారు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి.
''ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం చేస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాంతాలను అసలు పట్టించుకోలేదు.'' అన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి.
''ఈ ప్రాజెక్టు ప్రభుత్వం తలచుకుంటే పూర్తి చేయడం పెద్ద సమస్య కాదు. కానీ కావాలనే మునుగోడును నిర్లక్ష్యం చేశారు'' అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.
ఒకప్పుడు మునుగోడును మరో సమస్య వేధించేది. అదే ఫ్లొరైడ్. కానీ ఇప్పుడు ఆ సమస్య కాస్త తగ్గింది. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ కుళాయిలు ఇచ్చారు. అయితే అందులో వచ్చే నీరు ఎంత బావుంది అని అడిగినప్పుడు బిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొందరు ఆ నీటిని కాచుకుని తాగుతున్నారు. కొందరు వాటిని వాడుకుని, నీళ్ల క్యాన్లు కొనుక్కుని తాగుతున్నారు. మొత్తంగా ఫ్లొరైడ్ ప్రభావం చాలా తగ్గింది అని చెప్పవచ్చు. కానీ భూగర్భ ఫ్లొరైడ్ పోవాలంటే కూడా సాగునీరు రావాలని స్థానికులు చెబుతున్నారు.
మునుగోడులో మద్యం.. డబ్బు.. ఇలా అన్నీ ఏరులై పారుతున్నాయి... ఒక్క నీళ్ళు ఏరులై, కాలువలై ఎప్పుడు పారతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?
- పవన్ కల్యాణ్ జనసేన దారేది?
- మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?
- మునుగోడు ఉపఎన్నిక : 'ఇక్కడ ఓటుకు ఎంఆర్పీ రేటును ఎలా నిర్ణయిస్తున్నారంటే...’’
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)