నా తల్లిని తిట్టారు..: ఆఖరి రాగం పాడేసిన ప్రధాని మోదీ
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. బిహార్. అక్టోబర్/నవంబర్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును కొనసాగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ల రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 65 లక్షల మంది మరణించిన ఓటర్ల వివరాలను వెబ్ సైట్ లో పొందుపర్చాలని ఆదేశించింది.
ఈ పరిణామాల మధ్య బిహార్ ప్రజలను ఉద్దేశించి తాజాగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాంగ్రెస్- రాష్ట్రీయ జనతాదళ్ లపై విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలు సంధించారు. పదునైన ఆరోపణలను చేశారు. స్వర్గస్తురాలైన తన తల్లిని దూషించారని, బహిరంగంగా తిట్టారని మోదీ ఆరోపించారు. ఈ ఘటన దేశంలోని ప్రతి మహిళకు, ముఖ్యంగా బీహార్‌లోని మహిళలకు అవమానకరమని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరికీ కన్న తల్లే సర్వస్వం అని, ఆమెనే మన ప్రపంచం అని మోదీ పేర్కొన్నారు. భారత గడ్డపై తల్లిని పూజించుకోవడం సత్సంప్రదాయమని, అమ్మ ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఎన్నో సంప్రదాయాలకు పేరుగాంచిన ఈ బీహార్‌లో కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్- ఆర్జేడీ నాయకులు తన తల్లిని బహిరంగ సభలో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ లో అటువంటి ఘటన చోటు చేసుకుంటుందని ఊహించలేకపోయానని చెప్పారు.
కాంగ్రెస్- ఆర్జేడీ నాయకులు చేసిన ఈ దూషణలు ఒక్క తన తల్లికి మాత్రమే అవమానకరం కాదని, ఇవి దేశంలోని ప్రతి మాతృమూర్తిని కూడా ఘోరంగా అవమానించినట్లేనని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతి తల్లికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి ఆడబిడ్డకు, ప్రతి కూతురికి ఇది అత్యంత అవమానకరమని మోదీ అన్నారు. ఇది చూసిన తర్వాత, విన్న తర్వాత బీహార్‌లోని ప్రతి తల్లికీ ఎంత బాధ కలిగిందో తనకు తెలుసునని చెప్పారు. " అన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi says, "Mother is our world. Mother is our self-respect. I had not even imagined what happened a few days ago in this tradition-rich Bihar. My mother was abused from the stage of RJD-Congress in Bihar... These abuses are not just an insult to… pic.twitter.com/POPJbGFGqt
— ANI (@ANI) September 2, 2025
ఈ దూషణలు విన్న తర్వాత తాను ఎంత బాధపడి ఉంటానో, తన హృదయం ఎంతగా గాయపడి ఉంటుందో, గుండెల్లో ఎంత బాధ ఉందో, బీహార్ ప్రజలు కూడా అదే బాధలో ఉన్నారని తెలుసు అని మోదీ వ్యాఖ్యానించారు. ఆగస్టు 28న ఈ ఘటన చోటు చేసుకుంది. దర్భంగాలో ఓట్ అధికార్ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నుండి మహ్మద్ రిజ్వీ అలియాస్ రజా అనే వ్యక్తి ప్రధాని మోదీ తల్లిని హిందీలో దూషిస్తున్న వీడియో వైరల్ అయింది.












Click it and Unblock the Notifications