ఈ శాపగ్రస్త ఆలయం ఇక కనిపించదు: శ్రీకృష్ణుడు శపించినట్లే.. కలియుగాన అంతం
ఈ శాపగ్రస్త ఆలయం ఇక కనిపించదు: కబళించిన ప్రళయం
ఉత్తరాఖండ్‌లో ఖీర్ గంగలో ఈ నెల 6వ తేదీన క్లౌడ్ బరస్ట్ వల్ల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా అతి ప్రాచీన ఆలయం భూమిలో కూరుకుపోయింది. మహాభారత కాలం నాటి శైవక్షేత్రం అది. ఇక్కడి శివలింగాన్ని పాండవులు ప్రతిష్ఠించారని ప్రతీతి. పాండవుల కోరిక మేరకు సాక్షాత్ పరమ శివుడే ఇక్కడ వెలిశాడని నమ్ముతారు.
అదే- కల్ప్ కేదార్ ఆలయం. హిమాలయాల్లో అత్యంత మహిమాన్విత ఆలయంగా స్థానికులు చెబుతుంటారు. కొన్ని వేల సంవత్సరాల వరకు అత్యంత రహస్యంగా ఉంటూ వచ్చిన ఈ ఆలయం 1960 దశకంలో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి తరచూ భక్తులు ఈ ఆలయంలో పూజలు చేస్తూ వచ్చారు.

ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ సందర్భంగా ఈ ఆలయం మళ్లీ భూమిలో కూరుకుపోయింది. మిన్ను విరిగి మీదపడినట్టుగా హిమాలయా పర్వత శ్రేణుల నుంచి విరుచుకుపడిన వరదల బారిన పడిందీ ఆలయం. 50 అడుగుల లోతు వరకు భూమిలో కూరుకుపోయింది. ధారాలి గ్రామం చాలామటుకు ఈ బురదలోనే మాయమైంది.
క్లౌడ్ బరస్ట్ సంభవిచేంత వరకు ఆలయ శిఖరంపై చెక్కిన కాలభైరవుడి రూపు ఒక్కటే కనిపించేది. శతాబ్దాల నాటి ఈ ఆలయం ఉనికికి అదే ఏకైక గుర్తుగా ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా కనుమరుగైంది. ప్రకృతి విపత్తులో అది కొట్టుకుపోయి ఉండవచ్చు లేదా మరింత లోతుకు కూరుకుపోయి ఉండవచ్చు అని స్థానికులు భావిస్తున్నారు.
కల్ప్ కేదార్ ఆలయం ఎప్పుడూ పూర్తిగా బహిర్గతం కాలేదు. ఈ వారం వచ్చిన విపత్తుకు చాలా కాలం ముందు, ఆలయం ఎక్కువగా భూమి లోపలే ఉండేది. 1900ల్లో సంభవించిన విపత్తు వల్ల ఇది భూమిలోపల చిక్కుకుందని ధారాలి ప్రజలు నమ్ముతారు. ఆలయం లోపల ఉన్న శివలింగం కూడా ఎప్పుడూ పూర్తిగా కనిపించలేదు.
1980లలో తవ్వకాల ప్రయత్నాలు చేశారు గానీ అది సాధ్యపడలేదు. గర్భగుడిని బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఏదో ఒక ఆటంకం కలుగుతూ వచ్చింది. దీంతో ఆ ప్రయత్నాలను మానుకున్నారు స్థానికులు. దీంతో గుడి పైభాగానికి మాత్రమే పూజలు చేస్తూ వచ్చారు.
దీంతో- ఈ ఆలయం మహిమాన్వితమైనదనే నమ్మకం మరింత బలపడింది. ఆలయంలో ఏదో మార్మిక శక్తి, మర్మం ఉందనే విశ్వాసం పెరిగింది స్థానికుల్లో. ఈ ఆలయ నిర్మాణం కేదార్‌నాథ్ ధామ్‌ను పోలి ఉంటుందని పురావస్తు శాఖ అధికారులు అప్పట్లో వెల్లడించారు కూడా.
అందుకే దీనికి కల్ప్ కేదార్ అని పేరు పెట్టారు. కేదార్‌నాథ్ లా ప్రాచుర్యంలోకి రాలేదు. కథలు, పురాణాల్లో మాత్రమే దీని ఉనికి ఉంటూ వచ్చింది ఇన్నేళ్లు. పాక్షికంగా కనిపించినప్పటికీ.. ఉత్తరకాశీ ప్రజలు, ఆధ్యాత్మిక అన్వేషకులకు ఈ ఆలయం ఓ రహస్య మందిరంగా మిగిలిపోయింది.
ఉత్తరాఖండ్‌లోని ధారాలీ- హర్సిల్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కీర్ గాడ్ నది ఆకస్మికంగా ఉగ్రరూపం దాల్చింది. ఇది ఇళ్ళు, తోటలు, జ్ఞాపకాలను ధ్వంసం చేసింది. ఈ వరదలో పవిత్రమైన కల్ప్ కేదార్ ఆలయం కూడా కొట్టుకుపోయింది. పాండవులు తమ అజ్ఞాతవాసంలో ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు.
ఇది శాపగ్రస్త ఆలయంగా స్థానికులు చెబుతుంటారు. ఇదొక దైవిక రహస్యమని, కలియుగంలో ఈ ఆలయం కనుమరుగు అవుతుందని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శాపం పెట్టాడని ధారాలి ప్రజలు కథలు కథలుగా చెబుతుంటారు. అదే వాస్తవం అయిందని నమ్ముతున్నారక్కడి ప్రజలు.












Click it and Unblock the Notifications