బీహార్ అంటే జంగిల్ రాజ్ అనుకున్నా..
Nara Lokesh: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి తెల్లవారు జాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. ఇక చివరిదైన రెండో విడత పోలింగ్ ఈ నెల 11వ జరుగనుంది. దీని తర్వాత 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
రెండో విడత ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రానికి తెరపడనుంది. జనతాదళ్ (యునైటెడ్)- బీజేపీ, రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి.. తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. జేడీయూ- బీజేపీ కూటమి.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను ప్రచార బరిలోకి దించింది. శనివారం సాయంత్రమే ఆయన పాట్నాకు చేరుకున్నారు.

తాజాగా ఆయన పాట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీహార్ లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటేనే దేశం పురోగమిస్తుందని వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పరిపాలనను అందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు.
దేశానికి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కలిగిన నాయకత్వం ఉందని, అవినీతి రహిత పాలన దేశ ప్రజలకు లభిస్తోందని చెప్పారు. బీహార్‌కు అత్యంత బలమైన 'నాని (నరేంద్ర మోదీ- నితీష్ కుమార్) నాయకత్వం' ఉందని, ఏపీలో నమో ' (నాయుడు-మోదీ) ప్రభుత్వం ఉందని గుర్తు చేశారు. ఈ నాయకులందరూ రాష్ట్రాలు, దేశ పురోగతికి అంకితం అయ్యారుని చెప్పారు. గతంలో బిహార్ అనగానే జంగిల్ రాజ్ అనే పదం ఎక్కువగా వినిపించేదని, ఇప్పుడు అభివృద్ధి బాటలో పయనిస్తోందని నారా లోకేష్ అన్నారు.
రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య వంటి రంగాల్లో అనేక చర్యలు తీసుకున్నారని, ఎన్డీఏకు మరోసారి స్పష్టమైన అధికారాన్ని ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలపై నారా లోకేష్ స్పందించారు. ఈ ఆరోపణలు ఉన్నందువల్లే స్పెషల్ రివిజన్ చేపట్టారని వివరించారు. ఓటర్ల జాబితాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా పరిశీలించాలని, ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పౌరులకు కల్పిస్తుందని అన్నారు.
టీడీపీకి పటిష్టమైన వ్యవస్థ ఉందని, తమ బూత్ స్థాయి కార్యకర్తలకు తమ బూత్‌లో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసని ఆయన పేర్కొన్నారు. ఏవైనా మార్పులు జరిగితే, ఆ సమాచారాన్ని కార్యకర్తలు అందిస్తారని, తద్వారా వాటిని పరిశీలించవచ్చని ఆయన తెలిపారు. ఒకవేళ పొరపాటున ఏవైనా తొలగింపులు జరిగితే, ఓటరు నమోదు పూర్తయ్యేలా చూస్తారని లోకేష్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి ఇప్పుడు ఓటర్ల జాబితా ప్రాముఖ్యత గురించి తెలిసిందంటే అది చాలా దురదృష్టకరమని సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications