రూ.200 కోట్ల డ్రగ్స్ సీజ్.. ముఠా గుట్టురట్టు !!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రూ.200 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మొదట ఒక ఫామ్‌హౌస్‌పై జరిపిన దాడితో ఈ ఆపరేషన్ ప్రారంభమవ్వగా.. అక్కడ లభించిన కీలక ఆధారాలతో NCB మూడు రోజుల పాటు విస్తృత తనిఖీలు చేపట్టి ఒక అంతర్జాతీయ సింథటిక్ డ్రగ్ నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చింది.
కాగా విదేశీయుల ఆధ్వర్యంలోనే ఈ ముఠా నడుస్తోందని దర్యాప్తులో తేలింది. ఫామ్‌హౌస్ దాడి తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని అనేక ప్రాంతాలలో పోలీసులు నిఘా పెట్టి, అనుమానితుల కదలికలను ట్రాక్ చేశారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా, మంగ్రౌలి గ్రామానికి చెందిన 25 ఏళ్ల షేన్ వారిస్‌ను NCB అరెస్టు చేసింది.

అరెస్టు సమయంలో షేన్ నోయిడా సెక్టార్ 5లోని హరోలాలో అద్దెకు ఉంటున్నాడు. అతను ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని సమాచారం. తన బాస్ ఆదేశాల మేరకు షేన్ నకిలీ సిమ్ కార్డులు, వాట్సాప్, జాంగి వంటి ఎన్‌క్రిప్టెడ్ చాట్ యాప్‌లను ఉపయోగించి తన స్థానాన్ని గుర్తించకుండా జాగ్రత్తపడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
NCB అధికారులు షేన్‌ను నవంబర్ 20న అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లో తన పాత్రను అంగీకరించి, అనేక కీలక వివరాలను అందించినట్లు అధికారులు తెలిపారు. షేన్ విచారణలో ఎస్తేర్ కిమాని అనే మహిళ పేరును వెల్లడించాడు. ఆమెకు పోర్టర్ రైడర్ ద్వారా పెద్ద మొత్తంలో డ్రగ్స్ పంపాడని, ఆమె చిరునామా, సంప్రదింపు సమాచారాన్ని అందించాడని NCB అధికారులు వెల్లడించారు.
షేన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. NCB నవంబర్ 20న ఛత్తర్‌పూర్ ఎన్‌క్లేవ్ ఫేజ్ 2లోని ఒక ఇంటిపై తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలో ఆ ఇంటి నుంచి 328.54 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో సింథటిక్ డ్రగ్స్ పట్టుబడటం ఇటీవలి సంవత్సరాలలో సాధించిన అతిపెద్ద విజయాలలో ఒకటిగా దర్యాప్తు సంస్థ పేర్కొంది.
డ్రగ్స్ దొరికిన ఫ్లాట్‌లో ఉన్న నాగాలాండ్‌కు చెందిన ఎస్తేర్ కినిమిని అరెస్టు చేశారు. ఈ కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని.. మొత్తం నెట్‌వర్క్‌లోని ఇతర లింక్‌లపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications