నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు..! దేశంలో తొలిసారి..!
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 12 ఏళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ పేరును తొలిసారి ఓ ఎయిర్ పోర్టుకు పెట్టబోతున్నారు. ఇప్పటికే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియానికి పేరు మార్చి నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు పెట్టారు. ఇప్పుడు మరో రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఓ ఎయిర్ పోర్టుకు పేరు మార్చి నరేంద్ర మోడీ పేరు పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా ప్రాంతంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రస్తుతం ఉన్న పేరును మార్చి నరేంద్ర మోడీ అంతర్జాతీయ విమానాశ్రయం ( Narendra Modi International Airport) గా పేరు మార్చాలని యూపీ ప్రభుత్వం ఇవాళ నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా ఉన్న పేరును కాస్తా నరేంద్ర మోడీ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు ఉత్తర్ ప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వయంగా ప్రకటన చేశారు.

నోయిడా ఎయిర్ పోర్టును నరేంద్ర మోడీ ఎయిర్ పోర్టుగా మార్చే ప్రతిపాదనను ఆమోదించిన మంత్రివర్గం, ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్‌కు ఒక గొప్ప బహుమతి అని, దీనికి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతోందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. జేవార్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తరప్రదేశ్ మంత్రిమండలి కృతజ్ఞతలు తెలుపుతోందని ఆయన తెలిపారు. దీనికి నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం, నోయిడా-జేవార్ అని పేరు పెట్టే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించిందన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్‌లోనే అతిపెద్ద విమానాశ్రయంగా, దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఆవిర్భవించనుందని యోగీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఏడాది మార్చి 28న ఈ విమానాశ్రయం ప్రారంభమైంది. జూన్ 15న లక్నో నుంచి వచ్చిన ఇండిగో విమానంతో ఇక్కడ తొలి విమాన ల్యాండింగ్ జరిగింది. యూపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.













Click it and Unblock the Notifications
