వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోదీ: జమ్ములోని పల్లి గ్రామం ప్రత్యేకత ఏంటి? ప్రధాని ఇక్కడే ఎందుకు పర్యటిస్తున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

జమ్ములోని సాంబా జిల్లా పల్లి గ్రామ పంచాయతీ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని తొలి కార్బన్ రహిత గ్రామ పంచాయతీగా 'పల్లి' అవతరించనుంది.

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 24న భారత ప్రధాని నరేంద్ర మోదీ, 500 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంటును పల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు అంకితం చేయనున్నారు. దీనితర్వాత ఇది కార్బన్ రహిత పంచాయతీగా నిలుస్తుంది. ఇక్కడి ప్రజలు స్థానిక పవర్ గ్రిడ్ స్టేషన్లలో ఉత్పత్తి చేసిన కార్బన్ రహిత విద్యుత్‌ను పొందనున్నారు.

modi

రికార్డు స్థాయిలో 20 రోజుల వ్యవధిలోనే ఈ ప్లాంటును నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంటు 340 ఇళ్లకు సౌర విద్యుత్‌ను అందిస్తుంది.

ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రోజుకు 18 గంటలకు పైగా కష్టపడినట్లు సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సూపర్‌వైజర్, సీనియర్ సైట్ ఇంజినీర్ మొహమ్మద్ యాసిన్ చెప్పారు. వర్కర్లు, సైట్ ఇంజినీర్లు, ఇతర నిపుణులతో కూడిన బృందం 20 రోజుల్లోనే ఈ ప్లాంటును పూర్తి చేయడంలో విజయవంతమైందని అన్నారు.

సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ పనిని పూర్తి చేయడానికి 90 రోజుల సమయం పడుతుంది. ప్రధానమంత్రి కార్యాలయం, స్థానిక పరిపాలన విభాగం నుంచి లభించిన సహాయం, ప్రోత్సాహానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారి సహాయం లేకుండా ఈ పని కష్టమని అన్నారు.

''దీన్ని 20 రోజుల్లోనే పూర్తి చేయడం మాకు గర్వంగా ఉంది. 6,408 చ.మీ విస్తీర్ణంలో 500 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశాం. ఏప్రిల్ 24న ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించాం'' అని ఆయన చెప్పారు.

ఈ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం వల్ల పల్లి గ్రామ ప్రజలకు విద్యుత్ కోతల నుంచి ఉపశమనం లభిస్తుందని బీబీసీ హిందీతో స్థానిక సర్పంచ్ రణ్‌ధీర్ శర్మ అన్నారు.

''ఇంతకుముందు 6 నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు ఉండేవి. ఈ ప్లాంటు వల్ల ఇక వాటి నుంచి తప్పించుకుంటాం. సౌర విద్యుత్ కారణంగా ప్రజలకు విద్యుత్ చార్జీలు కూడా తగ్గుతాయి'' అని చెప్పారు.

ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా పల్లి గ్రామ పంచాయతీ నూతనోత్తేజాన్ని సంతరించుకుంది. అక్కడ రోడ్లను తీర్చిదిద్దుతున్నారు.

''ఇంతకుముందు మెయిన్ రోడ్డు నుంచి పల్లి గ్రామాన్ని కలిపే రహదారులు చాలా అధ్వాన్నంగా ఉండేవి. కానీ, ప్రధాని పర్యటన కారణంగా ఇప్పుడు పల్లి గ్రామాన్ని కలిపే రోడ్లన్నీ మరమ్మతు చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు, తాజా పువ్వులతో అలంకరిస్తున్నారు'' అని బీబీసీ హిందీతో స్థానికుడు రూప్ కుమార్ చెప్పారు.

గ్రామంలోని పబ్లిక్ టాయిలెట్లు, పంచాయతీ కార్యాలయం నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు ఇలా అన్ని చోట్లా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని పోస్టర్లు, నినాదాల రూపంలో ప్రతీచోటా ఏర్పాటు చేశారని అన్నారు.

గ్రామ సర్పంచ్ రణ్‌ధీర్ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. పల్లి, ఒక అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీగా అవతరించిందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ఇక్కడి ప్రజాప్రతినిధులు తమ పంచాయతీలను ఎలా అభివృద్ధి చేశారో తెలుపుతూ దేశంలోని ఇతర పంచాయతీలకు దీన్ని మార్గదర్శకంగా చూపనున్నారు. పల్లి గ్రామాన్ని నేరుగా జమ్ము జిల్లాతో కలిపే ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును తాను గత వారమే ప్రారంభించానని రణ్‌ధీర్ చెప్పారు.

గ్రామంలోని చాలా ఇళ్లకు సోలార్ స్టౌలు ఇచ్చారు. నీటి వృధాను అరికట్టడానికి గ్రామంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద తడి, పొడి చెత్త కోసం ప్రత్యేక షెడ్లు నిర్మిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు అన్ని పథకాలు పల్లి పంచాయతీలో మంచి ప్రగతిని సాధించాయని, లబ్ధిదారుల నమోదు పూర్తయిందని, ఆర్థిక సహాయం నేరుగా వారి ఖాతాల్లోకి చేరుతోందని రణధీర్ శర్మ తెలిపారు. రైతుల నుంచి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు.

పల్లి వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ... 30 వేల మంది పంచాయతీ సభ్యులతో సహా లక్ష మంది సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం 37 ఎకరాల స్థలంలో ఏసీతో కూడిన సదుపాయాలను ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థలకు చెందిన సభ్యులు కూడా ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రధాని మోదీని కలిసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

''ప్రధాన మంత్రికి స్వాగతం పలికేందుకు మా పాఠశాల ఆవరణను పూర్తిగా నవీకరిస్తున్నాం. ఆయనను కలిసేందుకు విద్యార్థులంతా ఉత్సాహంగా ఉన్నారు'' అని స్కూల్ ప్రిన్సిపల్ కమల్‌జీత్ చెప్పారు.

పాఠశాల కారిడార్‌లో డ్రాయింగ్ టీచర్ రవీందర్ సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో గోడలకు పేయింటింగ్స్ వేయడంలో చాలామంది విద్యార్థులు నిమగ్నమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు

ఆర్టికల్ 370, 35-ఎ రద్దు తర్వాత ప్రధాని మోదీ జమ్ములో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో జమ్ము కశ్మీర్‌లో జరిగే శాసన సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేయడానికి కూడా ఆయన ప్రయత్నిస్తారు.

ప్రధానమంత్రి పర్యటన తర్వాత జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ (రిటైర్డ్) నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల డిలిమిటేషన్ కమిషన్ త్వరలోనే తమ తుది నివేదికను విడుదల చేసే అవకాశం ఉంది. అమర్‌నాథ్ యాత్ర తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైన ఎన్నికల గంటా మోగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

2021 నవంబర్‌లో రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళిని జరుపుకున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి జమ్ము-కశ్మీర్ బీజేపీ యూనిట్ నేతలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు, రాజకీయ కారిడార్లలో చర్చ నడుస్తోంది.

ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు ఇంటింటికీ ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు. దీన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు జమ్ము-కశ్మీర్‌కు పూర్తిగా రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐఎం, సీపీఐ వంటి పార్టీలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.

''2018 నుంచి గవర్నర్ పాలన కొనసాగుతోంది. సామాన్యుల కష్టాలు పెరిగిపోతూనే ఉన్నాయి. నిరుద్యోగం పెరిగిపోతునప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని'' ఉమ్మడి విలేఖరుల సమావేశంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ పర్యటన తర్వాత, మే 8న జమ్ములో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సంకల్ప్ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉంది.

జమ్ము, కశ్మీర్‌లో అభివృద్ధి ప్రణాళికలు

నిరుద్యోగ యువతకు కొత్త అవకాశాలను అందించడంతోపాటు జమ్ము-కశ్మీర్‌లో అభివృద్ధి పనులకు మరింత ఊతమివ్వడం కోసం ప్రధాని మోదీ... ఈ పర్యటనలో రూ. 38,082 కోట్ల రూపాయల విలువైన పారిశ్రామిక అభివృద్ధి ప్రతిపాదనలకు శంకుస్థాపన చేయనున్నారు.

ఆ తర్వాత జమ్ము, కశ్మీర్‌లో వచ్చే నాలుగేళ్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు 850 మెగావాట్ల రాటిల్ పవర్ ప్రాజెక్టుతో పాటు 540 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.

వీటితో పాటు అయిదు ఎక్స్‌ప్రెస్‌వేల శంకుస్థాపన, బనిహాల్- ఖాజిగుండ్ లింక్‌ను ప్రారంభించనున్నారు. 100 జన ఔషధి కేంద్రాలను ప్రజలకు అంకితం చేయనున్నారు. బ‌నిహాల్- ఖాజీగుండ్ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు.

గ్రామంలో ఆంక్షలు

జమ్ము, కశ్మీర్‌లో భద్రతా సిబ్బంది, మైనారిటీ సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధుల హత్య కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో మోదీ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

వేదిక పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్నందున, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి వీలుగా సరిహద్దు బెల్ట్‌లో ప్రత్యేక భద్రతా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.

బాంబు నిర్వీర్య దళాలతో పాటు డ్రోన్లను మోహరించారు. గ్రామంలో బయటి వ్యక్తుల రాకపోకలపై నిషేధం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Narendra Modi: What is so special about Palli village in Jammu? Why is the Prime Minister touring here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X