అదో ఫొటో సెషన్! 2024లోనూ ప్రధానిగా మోడీనే, 300కుపైగా సీట్లు: విపక్షాల భేటీపై అమిత్ షా
శ్రీనగర్: బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. అదొక ఫొటో సెషన్ అని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ సహా విపక్షాల నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఓ కార్యకర్రయంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఈ రోజు పాట్నాలో ఫొటో సెషన్ జరుగుతోంది. వారు ప్రధాని మోడీ, ఎన్డీఏను సవాల్ చేస్తున్నారు. ఈ సందర్బంగా వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. 2024లో కూడా మోడీనే ప్రధాని అవుతారు. అది కూడా 300కుపైగా సీట్ల మెజార్టీతో..' అని అమిత్ షా స్పష్టం చేశారు. అత్యయిక పరిస్థితి వేళ ప్రజాస్వామ్య హననాన్ని చూసిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో కలిసి రావడం విచిత్రంగా ఉందన్నారు. వారంతా కలిసి తాము బీజేపీని ఒంటరిగా ఓడించలేమని ఈ సమావేశంతో వెల్లడి చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేసినందుకు కాంగ్రెస్ పార్టీకి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ఆ పార్టీకి ఇతరుల అవసరముందన్నారు.

విపక్షాల భేటీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో జైలుకు వెళ్లిన నేతలే ఇప్పుడు ఆమె మనవడు రాహుల్ గాంధీకి ఆహ్వానం పలుకుతున్నారని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతలుగా ఉన్న లాలూ, నితీష్, జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జరిగిన పాల్గొని అరెస్టయ్యారన్నారు. రాజకీయాల్లో నేడు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్.. కాంగ్రెస్ పార్టీతో కలవడం కంటే పార్టీని మూసేయడం మంచిదని భావిస్తే.. ఇప్పుడు ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రే ఆ పార్టీతోనే కలిసిపోయారని విమర్శించారు.
1984 అల్లర్లు, అత్యయిక పరిస్థితి వంటివి కాంగ్రెస్ ప్రేమకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు మరో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. 2024 సార్వత్రిక ఎన్నికల నిమిత్తం పాట్నాలో నితీష్ కుమార్ ఒక వివాహ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి పెళ్లి కుమారుడు(ప్రధాని అభ్యర్థి) ఎవరు? అక్కడ ప్రతి ఒక్కరు తమను తాము అభ్యర్థులుగానే భావిస్తున్నారని మరో బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. ఇది వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి, అవినీతిని అనుసరిస్తోన్న నేతల సమావేశమని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications