నేషనల్ హెరాల్డ్ కేసు: రాహుల్ గాంధీని రెండో రోజూ ప్రశ్నించిన ఈడీ, రేపు మరోసారి
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రెండో రోజు కూడా ఈడీ విచారించింది. దాదాపు 10 గంటల పాటు విచారించిన ఈడీ.. బుధవారం కూడా హాజరు కావాలని రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద విచారిస్తున్న ఈడీ.. రెండో రోజు కూడా ప్రశ్నల వర్షం కురిపించింది.
అయితే, ఇంకా విచారణ పూర్తి కానందున బుధవారం మరోసారి హాజరు కావాలని సమన్లులో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 19 గంటల పాటు రాహుల్‌ను విచారించారు. రెండోరోజు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు సంధించిన ఈడీ అధికారులు.. రాహుల్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మంగళవారం ఉదయం 11.05 గంటలకు రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఉదయం విచారించి.. అధికారులు మధ్యాహ్నం ఆయనకు గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీంతో రాహుల్ ఈడీ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3.45గంటల సమయంలో బయటకు వచ్చారు. లంచ్ బ్రేక్ ముగిసిన అనంతరం సాయంత్రం 4.45 గంటల సమయంలో తిరిగి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రెండోరోజు సుమారు 10 గంటలపాటు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది.
కాగా, రాహుల్‌ను ఈడీ విచారణను నిరసిస్తూ రెండో రోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలో నిరసనలు తెలిపాయి. జన్‌పథ్ వద్ద నిరసన చేపట్టిన ఆ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌధురి, గౌరవ్ గగొయ్, దీపేందర్ సింగ్ హుడా, రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్ గ్రహి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని బాదార్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపాయి.












Click it and Unblock the Notifications